Niroshan Dickwella: డోపింగ్ కు పాల్పడి దొరికిపోయిన శ్రీలంక క్రికెటర్

Sri Lanka cricketer Niroshan Dickwella caught in doping violation

  • నిరోషన్ డిక్వెల్లాపై నిరవధిక సస్పెన్షన్ వేటు వేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు
  • లంక ప్రీమియర్ లీగ్ లో ఆడతున్న నిరోషన్ డిక్వెల్లా
  • డోప్ టెస్టులో పాజిటివ్ గా తేలిన వైనం!

శ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్వెల్లా డోపింగ్ కు పాల్పడి దొరికిపోయాడు. ఇటీవల లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) పోటీల సందర్భంగా వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) మార్గదర్శకాలను అనుసరించి శ్రీలంక క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు డోప్ టెస్టులు నిర్వహించింది. ఆటగాళ్లు నిషిద్ధ ఉత్ప్రేరకాలను వాడితే ఈ టెస్టుల్లో నిర్ధారణ అవుతుంది. 

వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ నిరోషన్ డిక్వెల్లా ఈ టెస్టులో పాజిటివ్ గా తేలినట్టు వెల్లడైంది. దాంతో అతడిపై శ్రీలంక క్రికెట్ బోర్డు నిరవధిక సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. 

డిక్వెల్లా శ్రీలంక జాతీయ జట్టుకు చివరిసారిగా 2023లో ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం లంక ప్రీమియర్ లీగ్ లో గాలే మార్వెల్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. 31 ఏళ్ల డిక్వెల్లా తన కెరీర్ లో 54 టెస్టులు, 55 వన్డేలు, 28 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. టెస్టుల్లో 2,757 పరుగులు, వన్డేల్లో 1,604 పరుగులు, టీ20 అంతర్జాతీయ పోటీల్లో 480 పరుగులు చేశాడు. వన్డేల్లో 2 సెంచరీలు, టెస్టుల్లో 22 అర్ధసెంచరీలు అతడి పేరిట నమోదయ్యాయి. 

నిరోషన్ డిక్వెల్లా జాతీయ జట్టులో ఉన్న సమయంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నాడు. మైదానం వెలుపల తన ప్రవర్తన కారణంగా పలుమార్లు క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్నాడు. 2021లో బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘించి సస్పెన్షన్ కు గురైన ముగ్గురు క్రికెటర్లలో డిక్వెల్లా కూడా ఉన్నాడు.

More Telugu News