Sachin Tendulkar: సచిన్ ఆల్ టైమ్ రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: పాంటింగ్
- టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డు సచిన్ సొంతం
- ఆ రికార్డును జో రూట్ మాత్రమే బద్దలుకొట్టగలడన్న పాంటింగ్
- వివిధ అంశాలను ఉదహరించిన ఆసీస్ లెజెండ్
క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ ఒక శిఖరం. క్రికెట్ చర్రితలోనే మేటి బ్యాట్స్ మన్లలో ఒకడిగా నిలచిపోయే సచిన్ ఖాతాలో ఉన్న రికార్డులు అన్నీ ఇన్నీ కావు. వాటిలో టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డు ఒకటి. కెరీర్ లో మరెవ్వరికీ సాధ్యం కాని రీతిలో 200 టెస్టులు ఆడిన సచిన్ 15,921 పరుగులు సాధించాడు.
కాగా, సచిన్ రికార్డుపై ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ స్పందించాడు. సచిన్ ఆల్ టైమ్ రికార్డును బద్దలుకొట్టే సత్తా ఉన్న ఆటగాడు ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ మన్ జో రూట్ మాత్రమేనని అన్నాడు. ఇంగ్లండ్ జట్టులో కీలక ఆటగాడైన రూట్ ఇప్పటివరకు 143 టెస్టుల్లో 12,027 పరుగులు చేశాడు. రాబోయే సంవత్సరాల్లో సచిన్ రికార్డును రూట్ అధిగమించగలడని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.
సంజనా గణేశన్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాంటింగ్ మాట్లాడుతూ... "రూట్ వయసు ప్రస్తుతం 33 ఏళ్లు. సచిన్ సాధించిన పరుగులకు కేవలం 3 వేల పరుగుల దూరంలోనే ఉన్నాడు. ఏడాదికి 10 నుంచి 14 టెస్టులు ఆడి 800 నుంచి 1000 పరుగులు చేయగలిగితే... రూట్ మరో మూడ్నాలుగేళ్లలోనే సచిన్ రికార్డును చెరిపివేయగలడు. అప్పటికి రూట్ వయసు 37కి చేరుకుంటుంది. అయితే పరుగుల ఆకలి ఉండడం ముఖ్యం" అని వివరించాడు.
గత కొంతకాలంగా టెస్టు క్రికెట్లో నాణ్యమైన బ్యాటింగ్ ప్రదర్శన చేస్తున్న వారిలో రూట్ ఒకడని పాంటింగ్ పేర్కొన్నాడు. సాధారణంగా చాలామంది బ్యాట్స్ మెన్ 30 ఏళ్లు దాటాక కెరీర్ లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తుంటారన్న వాదన వినిపిస్తుంటుందని, రూట్ కూడా ఆ వయసులోనే ఉన్నాడని తెలిపాడు.
ఐదేళ్ల కిందట రూట్ అర్ధసెంచరీ సాధించిన తర్వాత దాన్ని సెంచరీగా మలచడంలో తరచుగా విఫలమయ్యేవాడని, కానీ ఇప్పుడు అర్ధసెంచరీని భారీ సెంచరీగా మలుస్తున్నాడని పాంటింగ్ వివరించాడు. ఆ లెక్కన సచిన్ రికార్డును అధిగమించేందుకు అన్ని అనుకూలతలు ఉన్న ఆటగాడు రూట్ మాత్రమేనని అన్నాడు.