ISRO: రేపు శ్రీహరికోట నుంచి నింగిలోకి ఈఓఎస్-08 ఉపగ్రహం

ISRO set to launch EOS 08 satellite tomorrow from Sriharikota

  • భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో
  • శాటిలైట్ ను మోసుకెళ్లనున్న ఎస్ఎస్ఎల్వీ రాకెట్
  • ఆగస్టు 16 ఉదయం 9.17 గంటలకు ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రేపు భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-08ని రోదసిలోకి పంపించనుంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని ఎస్ఎస్ఎల్వీ-డీ3 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. 

ఇస్రో... ఉపగ్రహ ప్రయోగాల కోసం ఎక్కువగా పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ రాకెట్లపై ఆధారపడుతూ వస్తోంది. ఇటీవల ఎస్ఎస్ఎల్వీ పేరిట రూపొందించిన సరికొత్త రాకెట్ ను వినియోగిస్తోంది. రేపటి ప్రయోగం ఎస్ఎస్ఎల్వీ పరంపరలో మూడోది. 

ఈవోఎస్-08 శాటిలైట్ ను మోసుకుంటూ ఎస్ఎస్ఎల్వీ-డీ3 రాకెట్ ఆగస్టు 16వ తేదీ ఉదయం 9.17 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఉపగ్రహాన్ని భూమికి 475 కిలోమీటర్ల ఎగువన వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్టు ఇస్రో వెల్లడించింది. 

ఎస్ఎస్ఎల్వీ చాలా ప్రత్యేకమైన రాకెట్. దీన్ని కేవలం 72 గంటల వ్యవధిలో ప్రయోగానికి సిద్ధం చేయవచ్చు. ముఖ్యంగా ఈ రాకెట్ ద్వారా ఉపగ్రహాలను రోదసిలోకి తీసుకెళ్లేందుకు చాలా తక్కువ ఖర్చవుతుంది. 

2022లో తొలిసారిగా నిర్వహించిన ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఆ మరుసటి ఏడాది నిర్వహించిన ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఉత్సాహం నెలకొంది. 

ఈసారి ఎస్ఎస్ఎల్వీ మోసుకెళ్లనున్న ఈవోఎస్-08 ఉపగ్రహం ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ ఫ్రారెడ్ పేలోడ్ (ఈవోఐఆర్), గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రిఫ్లెక్టోమెట్రీ పేలోడ్ (జీఎన్ఎస్ఎస్-ఆర్) తదితర వ్యవస్థలను కలిగి ఉంటుంది.

  • Loading...

More Telugu News