Rahul Gandhi: రాహుల్ గాంధీకి సీటు కేటాయింపుపై విమర్శలు... స్పందించిన కేంద్రం

Rahul Gandhi Historic Presence Sparks Row

  • ఒలింపిక్ విజేతలతో కలిసి కూర్చున్న రాహుల్ గాంధీ
  • ప్రోటోకాల్ ప్రకారం సీటు కేటాయించలేదని కాంగ్రెస్ ఆగ్రహం
  • కాంగ్రెస్ ఎంపీలకు వెనుక వరుసలో సీట్లు కేటాయించినట్లు ప్రభుత్వం వెల్లడి

ఎర్రకోటలో 78వ స్వాతంత్ర్య వేడుకలలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇలా ప్రతిపక్ష నేత హాజరు కావడం దశాబ్దకాలం తర్వాత ఇదే మొదటిసారి. ఆయన ఒలింపిక్ విజేతలతో కలిసి కూర్చున్న ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. అదే సమయంలో రాహుల్ గాంధీకి వెనుక వరుసలో సీటు కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి.

ప్రోటోకాల్ ప్రకారం రాహుల్ గాంధీకి సీటును కేటాయించలేదని, ఆయనకు చివరి వరసలో ఇచ్చారని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. చివరి రెండు వరుసలలో ఒలింపిక్ క్రీడాకారుల మధ్య కూర్చున్నారని పేర్కొంది. ప్రతిపక్ష నేతకు కేబినెట్ హోదా ఉంటుందని, మంత్రులకు సమానంగా ముందు వరుసలో సీటును కేటాయించాలని తెలిపింది. కేబినెట్ హోదా ఉన్న ఆయనకు ప్రాధాన్యతా క్రమంలో ముందు వరుసలో సీటు కేటాయిస్తారని వివరించింది.

అల్ప బుద్ధి ఉన్నవారి నుంచి పెద్ద విషయాలు ఆశించడం వ్యర్థమని, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాహుల్ గాంధీని ఐదో వరుసలో కూర్చోబెట్టడం సరికాదని స్పష్టం చేసింది. అయినప్పటికీ రాహుల్ గాంధీకి ఎలాంటి పట్టింపులేదని, ప్రజల సమస్యలను ఆయన లేవనెత్తుతూనే ఉంటారని ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పేర్కొంది.

వివరణ ఇచ్చిన ప్రభుత్వం

కాంగ్రెస్ విమర్శలపై ప్రభుత్వం స్పందించింది. ఒలింపిక్ పతక విజేతలకు ముందు వరుసలో సీట్లు కేటాయించడంతో కాంగ్రెస్ ఎంపీలకు వెనుక వరుసలో కేటాయించినట్లు వెల్లడించింది.

More Telugu News