Anna canteens: నేటి నుండి ఏపీలో అన్న క్యాంటీన్ల పునః ప్రారంభం .. గుడివాడలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
- రేపు మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా 99 అన్న క్యాంటీన్ల ప్రారంభం
- క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుండి భారీగా విరాళాలు
- క్యాంటీన్ల నిర్వహణకు నారా భువనేశ్వరి కోటి విరాళం
ఏపీ వ్యాప్తంగా నేటి నుండి అన్న క్యాంటీన్ లు పునః ప్రారంభం అవుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలో సీఎం చంద్రబాబు తొలి క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మొదటి విడతగా వంద అన్న క్యాంటీన్ లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో క్యాంటీన్ల ఏర్పాటు వాయిదా పడింది. మిగిలిన జిల్లాల్లో నగర పాలక సంస్థలు, పురపాలక సంస్థల పరిధిలోని పట్టణాలు, నగరాల్లో క్యాంటిన్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు.
ఈరోజు సీఎం చంద్రబాబు గుడివాడలో అన్న క్యాంటీన్ ను ప్రారంభిస్తుండగా, రేపు (ఆగస్టు 16) 99 అన్న క్యాంటీన్ లను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. ఈ క్యాంటీన్ లలో మూడు పూటలా కలిపి రోజుకు 1.05 లక్షల మంది పేదలకు అహారం సరఫరా చేయనున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం 35 వేల మందికి చొప్పున అందించనున్నారు. ఒకొక్కరి నుండి పూటకు రూ.5 ల వంతున నామమాత్రపు రుసుము వసూలు చేస్తారు. అన్న క్యాంటీన్ లకు ఆహార సరఫరా బాధ్యతలను హరేకృష్ణ ఫౌండేషన్ కు అప్పగించారు.
ఇక రెండు, మూడు విడతల్లో మరో 103 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. కాగా, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేస్తున్న ఈ క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుండి భారీగా విరాళాలు అందుతున్నాయి. తాజాగా, సీఎం చంద్రబాబు అర్ధాంగి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి భారీ విరాళం అందజేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున కోటి రూపాయలు విరాళంగా అందించారు. ఈ విరాళం చెక్కును మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు అందజేశారు.