Mahesh Babu: తిరుమల కొండకు కాలినడకన మహేశ్ బాబు కుటుంబ సభ్యులు.. ఫొటో వైరల్

Mahesh Babu family members on foot to Tirumala Hill

  • అలిపిరి మెట్ల మార్గం గుండా బయలుదేరిన మహేశ్ బాబు కుటుంబ సభ్యులు
  • నడకమార్గంలో మెట్ల వద్ద కొబ్బరికాయ కొట్టి, కర్పూరం వెలిగించిన నమ్రతా శిరోద్కర్  
  • భక్తులను పలకరిస్తూ ముందుకు సాగిన మహేశ్ బాబు కుటుంబ సభ్యులు

కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని నిత్యం లక్షలాది మంది దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు. దేశ విదేశాల నుండి స్వామివారి దర్శనం కోసం తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. చాలా మంది భక్తులు తాము అనుకున్నది జరిగితే నడక మార్గంలో మెట్లకు పూజలు చేస్తూ తిరుమలకు చేరుకుని తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటుంటారు. ఇందులో సామాన్య భక్తులు మొదలుకొని సినీ, రాజకీయ, వ్యాపార వాణిజ్య ప్రముఖులు ఉంటుంటారు. సాధారణంగా విఐపీలు, వీవీఐపీలు నేరుగా తిరుమల కొండపైకి చేరుకుని బ్రేక్ దర్శనంలో సులువుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటుంటారు. అయితే కొందరు సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులు నడక మార్గంలో తిరుమలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. 
 
తాజాగా, ప్రముఖ సినీ హీరో మహేశ్ బాబు కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నడక మార్గంలో మహేశ్ బాబు అర్ధాంగి నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార..తిరుమలకు చేరుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ముందుగా సమ్రత శిరోద్కర్ నడక మార్గంలో మెట్లకు పూజలు చేస్తూ కొబ్బరికాయ కొట్టి, కర్పూరం వెలిగించి నడక మార్గంలో స్వామి వారి దర్శనానికి బయలుదేరారు. మహేశ్ బాబు కుటుంబ సభ్యుల వెంట అభిమానులు కూడా నడిచారు. వీరు నడక మార్గంలో భక్తులను పలకరిస్తూ కొండపైకి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బుధవారం రాత్రి తిరుమలలోని సుధాకృష్ణ నిలయం అతిధి గృహంలో బస చేసిన మహేశ్ బాబు కుటుంబ సభ్యులు ఈరోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.

More Telugu News