YS Sharmila: జగన్ ఇక అధికారంలోకి రాడు: షర్మిల

Sharmila says Jagan never come into power

  • జగన్ పై ధ్వజమెత్తిన షర్మిల
  • మళ్లీ అధికారంలోకి వచ్చి మోసం చేయడానికా? అంటూ ఆగ్రహం
  • వైసీపీ విశ్వసనీయత కోల్పోయిన పార్టీ అంటూ విమర్శలు 

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజా రాజకీయ అంశాలపై స్పందించారు. జగన్ మళ్లీ అధికారంలోకి ఎందుకు రావాలి? మళ్లీ రూ.10 లక్షల కోట్లు అప్పుచేయడానికి అధికారంలోకి రావాలా? అని విమర్శించారు. 

"ఎందుకు రావాలి మళ్లీ అధికారంలోకి? రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడమే కాకుండా, రుషికొండ ప్యాలెస్ లు కట్టుకోవడానికి అధికారంలోకి రావాలా? రాజశేఖర్ రెడ్డి గారు చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులకు మరమ్మతులు కూడా చేయలేదు... గేట్లు కూడా తేలుతున్న పరిస్థితి చూడ్డానికి మీరు మళ్లీ అధికారంలోకి రావాలా? 

రాజశేఖర్ రెడ్డి ఎంతగానో వ్యతిరేకించిన బీజేపీతో మీరు అక్రమ సంబంధం పెట్టుకుని... ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్, పోలవరంతో సహా విభజన హామీలన్నీ తాకట్టు పెట్టడానికి మళ్లీ మీరు అధికారంలోకి రావాలా? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి మళ్లీ అధికారంలోకి రావాలా? 

ప్రతి ఏటా రూ.4 వేల కోట్లతో రైతులకు ధరల స్థిరీకరణ నిధి అన్నారు... పంట నష్టపరిహారం ఇస్తామన్నారు... ఇలా మాటలు చెప్పి మోసం చేయడానికి మళ్లీ మీరు అధికారంలోకి రావాలా? 

కానీ జగన్ ఇక అధికారంలోకి రాడు... వైసీపీ ఇక అధికారంలోకి రాదు. ఎందుకంటే... ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చి చూశారు. దేవుడు బంగారుపళ్లెంలో అన్నీ పెట్టి ఇస్తే, ఆ అవకాశాన్ని ఎలా దుర్వినియోగం చేశారో ప్రజలు చూశారు. ఈ రోజు వైసీపీ విశ్వసనీయత కోల్పోయిన పార్టీ. కాబట్టి వాళ్లు మళ్లీ అధికారంలోకి వస్తారని మేం అనుకోవడంలేదు" అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News