Parvathaneni Harish: ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా తెలుగు వ్యక్తి పర్వతనేని హరీశ్

Parvathaneni Harish has been named as the next Permanent Representative of India to the UN

  • నియమించిన విదేశాంగ శాఖ
  • ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారిగా పనిచేస్తున్న హరీశ్
  • 1990లో ఇండియన్ ఫారిన్ సర్వీస్ లో చేరిన పర్వతనేని
  • ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి

ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా తెలుగు వ్యక్తి పర్వతనేని హరీశ్ నియమితులయ్యారు. 2021 నవంబర్ 6 నుంచి జర్మనీ రాయబారిగా పనిచేస్తున్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. 

ఐక్యరాజ్యసమితిలో దాదాపు నాలుగు దశాబ్దాలపాటు భారత్‌కు సేవలు అందించిన సీనియర్ దౌత్యవేత్త రుచిరా కాంబోజ్ జూన్ 1న పదవీ విరమణ చేశారు. దీంతో ఆమె స్థానంలో  హరీశ్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని విదేశాంగ శాఖ పేర్కొంది.

ఎవరీ పర్వతనేని హరీశ్...?

పర్వతనేని హరీశ్ తెలుగు వ్యక్తి. ఆయన హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చదివారు. మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఆయన గోల్డ్ మెడల్ సాధించారు. అనంతరం కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో చదివారు. పర్వతనేని నందితను పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

ట్రాక్ రికార్డు ఇదే..

పర్వతనేని హరీశ్ 1990లో ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరారు. 2021 నవంబర్ 6 జర్మనీలో భారత రాయబారిగా హరీష్ పనిచేస్తున్నారు. అంతకుముందు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఆర్థిక సంబంధాల అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో ఇతర దేశాలతో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను నెరపడంలో మంచి పేరు సంపాదించారు. ఆ తర్వాత మూడు దశాబ్దాలకు పైగా దౌత్యవేత్తగా కొనసాగారు. 

అరబిక్ నేర్చుకున్న ఆయన తూర్పు ఆసియాతో పాటు పలు దేశాలలో రాయబారిగా, భారత ఉపరాష్ట్రపతికి జాయింట్ సెక్రటరీగా కూడా పని చేశారు. 2012 నుంచి మార్చి 2016 వరకు హ్యూస్టన్‌లోని భారత కాన్సుల్ జనరల్‌గా పనిచేశారు. 2016 ఏప్రిల్ నుంచి 2019 జూన్ వరకు వియత్నాంలో భారత రాయబారిగా వ్యవహరించారు.

  • Loading...

More Telugu News