Congress: కేకే స్థానంలో... తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మనుసింఘ్వీ

Abhishek to contest in RS polls from Telangana

  • రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
  • ఇటీవల బీఆర్ఎస్‌తో పాటు రాజ్యసభకు రాజీనామా చేసిన కేకే
  • సెప్టెంబర్ 3న రాజ్యసభ ఎన్నికలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అభిషేక్ మనుసింఘ్వీ తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. తెలంగాణలోని రాజ్యసభ సీటుతో పాటు వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నాడు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కె.కేశవరావు కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్‌ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజ్యసభకు ఉప ఎన్నిక జరగనుంది. కేకే స్థానంలో అభిషేక్ మనుసింఘ్వీను రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

ఈరోజు నుంచి 21వ తేదీ వరకు రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. 27వ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియకు గడువు ఉంటుంది. సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు... ఫలితాలు వస్తాయి. 

తొమ్మిది రాష్ట్రాల్లో 12 రాజ్యసభ ఖాళీలకు ఎన్నికలు జరగనున్నాయి. అసోం, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల నుంచి 10 మంది సభ్యులు లోక్ సభకు ఎన్నిక కాగా... తెలంగాణ నుంచి ఒకరు, ఒడిశా నుంచి ఒకరు వివిధ కారణాలతో రాజీనామా చేశారు. దాంతో, మొత్తం 12 స్థానాల్లో ఉపఎన్నిక అనివార్యమైంది.

  • Loading...

More Telugu News