Telangana: తెలంగాణ హెడ్ కానిస్టేబుల్‌కు అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంటరీ పతకం

Independence Day Gallantry Awards

  • దేశవ్యాప్తంగా 1,037 మందికి మెడల్స్ ఫర్ గ్యాలంటరీ, సర్వీస్ మెడల్స్
  • యాదయ్యకు ఒక్కరికే రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు
  • 2022లో సాహసోపేతంగా నేరస్తులను పట్టుకున్నందుకు అవార్డు

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ... పోలీస్, ఫైర్ సర్వీసెస్, హోంగార్డ్స్, సివిల్ డిఫెన్స్ అధికారులకు బుధవారం వివిధ పోలీస్ పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1,037 మందికి గ్యాలంటరీ, సర్వీస్ మెడల్స్‌ను అందించనున్నారు. ఈ మేరకు ప్రకటించిన అవార్డు గ్రహీతల జాబితాలో తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్య ఉన్నారు. అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంటరీ పోలీస్ పతకం అందుకోనున్నది యాదయ్య ఒక్కరే కావడం విశేషం.

తెలంగాణ పోలీస్ శాఖలో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్య 2022లో ఓ చోరీ కేసులో ఎంతో ధైర్యంగా వ్యవహరించారు. ఇషాన్ నిరంజన్, రాహుల్ చైన్ స్నాచింగ్, అక్రమ ఆయుధాలు సరఫరా చేసేవారు. వీరిని యాదయ్య ఎంతో సాహసం చేసి పట్టుకున్నారు. 2022 జులై 25న వీరు చోరీకి పాల్పడుతుండగా యాదయ్య అడ్డుకున్నారు. దుండగులు ఆయనపై కత్తితో దాడి చేసి, ఛాతీపై పలుమార్లు పొడిచారు.

తనకు తీవ్ర రక్తస్రావం అవుతున్నప్పటికీ ఆయన వారిని పట్టుకున్నారు. ఈ గాయాలతో ఆయన ఆసుపత్రి పాలయ్యారు. 17 రోజులు ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకున్నారు. ఆయన ధైర్యాన్ని కేంద్రం కొనియాడింది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్యాలంటరీ అవార్డును ప్రదానం చేయనున్నట్లు హోంశాఖ ప్రకటించింది.

దేశవ్యాప్తంగా 1,037 మందికి పతకాలు ప్రకటించారు. ఇందులో 213 మందికి మెడల్స్ ఫర్ గ్యాలెంటరీ, 94 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా మెడల్స్, 729 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలను అందించనున్నారు. 

రెండు తెలుగు రాష్ట్రాలలో 46 మందికి పతకాలు దక్కగా... తెలంగాణ నుంచి 21 మందికి, ఏపీ నుంచి 25 మందికి పతకాలు దక్కాయి. తెలంగాణ నుంచి యాదయ్యకు రాష్ట్రపతి గ్యాలంటరీ పతకం, ఏడుగురికి మెడల్ ఫర్ గ్యాలంటరీ, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకం, 11 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు ఇవ్వనున్నారు.

  • Loading...

More Telugu News