Vinesh Phogat: వినేశ్ ఫోగాట్ అప్పీల్ పై తీర్పు మళ్లీ వాయిదా... ఈ నెల 16 వరకు ఆగాల్సిందే!
- అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ లో వినేశ్ ఫోగాట్ పై అనర్హత వేటు
- కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ను ఆశ్రయించిన వినేశ్ ఫోగాట్
- ఈ నెల 16న తీర్పు వెలువరించనున్న సీఏఎస్
ఇటీవల పారిస్ ఒలింపిక్స్ లో 100 గ్రాముల అధిక బరువు ఉందన్న కారణంగా పతకం కోల్పోయిన భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగాట్... సీఏఎస్ తీర్పుపై మరో మూడ్రోజులు నిరీక్షించకతప్పదు. వినేశ్ ఫోగాట్ అప్పీల్ పై తీర్పు మళ్లీ వాయిదా పడింది.
ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ 50 కిలోల కేటగిరీలో ఫైనల్ ఆడాల్సిన వినేశ్ ఫోగాట్ ను అధిక బరువు కారణంగా అనర్హురాలిగా ప్రకటించారు. దాంతో వినేశ్ పారిస్ లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తాత్కాలిక బెంచ్ ను ఆశ్రయించింది. వినేశ్ తరఫున భారతదేశ ప్రముఖ న్యాయవాదులు హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా వాదనలు వినిపించారు.
ఇవాళ తీర్పు వస్తుందని, వినేశ్ కు రజత పతకం ఖాయమవుతుందని అందరూ ఆశించారు. అయితే, వినేశ్ అప్పీల్ పై తీర్పును సీఏఎస్ ఆగస్టు 16కి వాయిదా వేసింది. వినేశ్ ఫోగాట్ వర్సెస్ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ వర్సెస్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కేసులో ఆర్బిట్రేటర్ డాక్టర్ అనబెల్లే బెన్నెట్ వాదనలు కూడా వినాలని సీఏఎస్ నిర్ణయించిందని, అందుకే తీర్పు వాయిదా వేశారని తెలుస్తోంది.