Pakistan Vs Bangladesh: పాక్ వర్సెస్ బంగ్లాదేశ్... రూ. 15కే మ్యాచ్ టికెట్!
- స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లు చూసేందుకు ఆసక్తి చూపని ప్రేక్షకులు
- పాక్-బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ టికెట్ ధరలను భారీగా తగ్గించిన పీసీబీ
- కనిష్ట ధరగా రూ.15.. గరిష్ట ధర రూ. 75వేలు
- రావల్పిండి, కరాచీలో ఇరు దేశాల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్
స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లు చూసేందుకు పాకిస్థాన్ అభిమానులు ఆసక్తి చూపడంలేదు. ఇటీవల నిర్వహించిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) కు కూడా ప్రేక్షకులు అంతగా రాలేదు. దీంతో త్వరలో జరగనున్న పాక్-బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ టికెట్ ధరలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భారీగా తగ్గించింది.
టికెట్ కనిష్ఠ ధరను రూ.15గా నిర్ధారించింది. ఇక గరిష్ఠ ధర వచ్చేసి రూ. 75వేలు. ఆగస్ట్ 21న ప్రారంభమయ్యే మొదటి టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న రావల్పిండి స్టేడియంలో ప్రీమియం ఎన్‌క్లోజర్ టికెట్ ధరను రూ.60గా, వీఐపీ ఎన్‌క్లోజర్‌లు రూ. 150గా నిర్ణయించారు. అయితే, వారాంతాల్లో వీఐపీ ఎన్‌క్లోజర్ టికెట్ ధరలు రూ. 180గా ఉంటాయని బోర్డు వర్గాలు వెల్లడించాయి. .
ఇక ఆగస్టు 30వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టు కరాచీలో జరగనుంది. ఇక్కడ టికెట్ల ధరలు మరింత తక్కువ. జనరల్ టికెట్ రూ.15, ఫస్ట్-క్లాస్ ఎన్‌క్లోజర్‌ల ధర రూ. 30గా ఉంటే.. ప్రీమియం ఎన్‌క్లోజర్‌లు రూ.60కే అందుబాటులో ఉన్నాయి. ఆగస్టు 13 నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయిస్తామని, కౌంటర్ల ద్వారా టిక్కెట్లను ఆగస్టు 16 ఉదయం 09:00 గంటల నుంచి పొందవచ్చని అధికారులు తెలిపారు.
ఇదిలాఉంటే... ఆగస్ట్ 21న ప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఆగస్టు 12న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పాకిస్థాన్‌కు బయలుదేరి వెళ్లింది. గత ఆదివారం బంగ్లాదేశ్ ఈ సిరీస్ కోసం తమ జట్టును ప్రకటించింది. అలాగే బంగ్లాదేశ్‌లో రాజకీయ అశాంతి ఉన్నప్పటికీ షకీబ్ అల్ హసన్ రెడ్ బాల్ గేమ్‌లలో పాల్గొంటాడని ధృవీకరించింది.