Crickingdom: ఇండోనేషియాలో క్రికెట్ అకాడమీ లాంచ్ చేసిన రోహిత్ శర్మ
- రోహిత్ శర్మ నేతృత్వంలో క్రికింగ్‌డమ్ అకాడమీ
- సింగపూర్, జపాన్, అమెరికా, బంగ్లాదేశ్ సహా పలు దేశాలలో అకాడమీ బ్రాంచీలు
- తాజాగా జకార్తాలో అకాడమీని ప్రారంభించిన భారత క్రికెటర్ ధవల్ కులకర్ణి
- ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా 35 బ్రాంచీలను కలిగి ఉన్న క్రికింగ్‌డమ్
టీమిండియా వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇండోనేషియాలో తన క్రికింగ్‌డమ్ అకాడమీని లాంచ్ చేశారు. జకార్తాలో దీనిని రోహిత్ శర్మ బెస్ట్ ఫ్రెండ్, భారత క్రికెటర్ ధవల్ కులకర్ణి ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా రోహిత్ సోదరుడు విశాల్ శర్మ అభిమానులతో పంచుకున్నాడు. దీంతో అకాడమీ ఓపెనింగ్ తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఇటీవల అమెరికాలోని డల్లాస్‌లోనూ హిట్‌మ్యాన్ ఈ అకాడమీని ప్రారంభించారు.
అసలేంటీ క్రికింగ్‌డమ్?
క్రిక్‌కింగ్‌డమ్ అనేది ఆటగాళ్లు, కోచ్‌లకు ఏకీకృత వ్యవస్థ ద్వారా సౌకర్యాలను అందిస్తూ క్రికెట్‌ను అభివృద్ధి చేయడానికి అంకితమైన వేదిక. ఔత్సాహిక క్రికెటర్లు నాణ్యమైన శిక్షణ పొందేలా అకాడమీని తీర్చిదిద్దడం జరిగింది. క్రికింగ్‌డమ్ ప్రధాన లక్ష్యం నిష్ణాతులైన కోచ్‌లు ఇచ్చే కోచింగ్ ద్వారా క్రికెటర్ల నైపుణ్యాలను మరింత మెరుగుపరచడమే. తద్వారా స్థానిక, అంతర్జాతీయ పోటీలకు వారిని సిద్ధం చేయడం.
రోహిత్ శర్మ నేతృత్వంలోని క్రికింగ్‌డమ్ ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని చాటుతోంది. ఈ అకాడమీ బ్రాంచ్‌లు ఇండియా, సింగపూర్, జపాన్, అమెరికా, బంగ్లాదేశ్ సహా పలు దేశాలలో ప్రారంభమయ్యాయి. ఇక మన దగ్గర ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు సహా వివిధ రాష్ట్రాలలో 35 బ్రాంచీలను క్రికింగ్‌డమ్ కలిగి ఉంది.