Hyderabad Metro: శంషాబాద్‌‌కు ప్రతిపాదిత మెట్రోలైన్‌తో సరికొత్త అనుభూతి.. ఈసారి భూగర్భంలో!

Hyderabad Metro Second Phase Will Be In Underground

  • ఎలివేటెడ్ మార్గంగా తొలిదశ మెట్రో
  • ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు రెండోదశ మెట్రో
  • ఈసారి భూగర్భం, భూమిపైన, ఎలివేటెడ్ మార్గాల్లో..
  • హైదరాబాద్‌లో ఇదే తొలిదశ భూగర్భ మెట్రో!
  • కిలోమీటరున్నరకు ఒక మెట్రో స్టేషన్

హైదరాబాద్‌లోని శంషాబాద్ వరకు విస్తరించనున్న ప్రతిపాదిత రెండోదశ మెట్రో ఈసారి ప్రయాణికులకు కొత్త అనుభూతి పంచనుంది. తొలిదశలో నిర్మించినవన్నీ ఎలివేటెడ్ మార్గాలే. ఇప్పుడు మాత్రం భూగర్భంలోనూ, భూమిపైన, ఆకాశ మార్గంలోనూ మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం నాగోల్ నుంచి రాయదుర్గం వరకు మెట్రో అందుబాటులో ఉంది. రెండో దశలో దీనిని ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి, పీ7 రోడ్, శంషాబాద్ విమానాశ్రయం వరకు 33.1 కిలోమీటర్ల మేర పొడిగించనున్నారు.

ఈ ప్రతిపాదిత మార్గంలో నాగోల్ నుంచి లక్ష్మీగూడ వరకు 21.4 కిలోమీటర్ల ఎలివేటెడ్ మార్గం ఉంటుంది. అక్కడి నుంచి పీ7 రోడ్డు విమానాశ్రయ ప్రాంగణం సరిహద్దు వరకు 5.28 కిలోమీటర్ల మేర భూమార్గం (ఎట్ గ్రేడ్) రూపంలో ఉంటుంది. అక్కడి నుంచి టెర్మినల్ వరకు 6.42 కిలోమీటర్ల మార్గం భూగర్భంలో నిర్మిస్తారు. నగరంలో ఇదే తొలి భూగర్భ మార్గం అవుతుంది. అలాగే, ఇక్కడ కార్గో, టెర్మినల్, ఏరోసిటీ స్టేషన్లు నిర్మించడంతోపాటు డిపోను కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. 

ఈ రెండోదశ మెట్రోలో కిలోమీటరున్నరకు ఓ స్టేషన్ ఉండేలా మొత్తం 22 స్టేషన్లు నిర్మిస్తారు. వీటిలో కొన్నింటిని భవిష్యత్తు అవసరాల కోసం ‘ఫ్యూచర్ స్టేషన్లు’గానూ ఉంచుతారు. అలాగే, నాగోల్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌ప్లలి వద్ద ఇంటర్ చేంజ్ స్టేషన్లు ఉంటాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్ పూర్తయింది. అవసరం అనుకుంటే మార్పులు చేస్తారు.

More Telugu News