Ramprasad Reddy: ఆడుదాం ఆంధ్రా పేరుతో 40 రోజుల్లోనే రూ.120 కోట్లు ఖర్చు చేసి అవినీతికి పాల్పడ్డారు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

120 crores spent in 40 days in the name of Audham Andhra and committed corruption Minister Mandipalli Ramprasad Reddy

  • ఐదేళ్లలో రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా మారుస్తామని పేర్కొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి
  • అమరావతి బ్రాండింగ్ తో ఐపీఎల్ క్రికెట్ టీంను ప్రమోట్ చేస్తామని వెల్లడి
  • అన్ని పాఠశాలలూ విద్యార్థులకు ఒక గంట క్రీడలకు కేటాయించాల్సిందేనని స్పష్టీకరణ

గత ప్రభుత్వం క్రీడలను పూర్తిగా విస్మరించిందని, చివరలో ఆడుదాం ఆంధ్రా అంటూ అభాసుపాలు కార్యక్రమం నిర్వహించి, అందులో కూడా 40 రోజుల్లో రూ. 120 కోట్లు ఖర్చు చేసి కుంభకోణానికి పాల్పడ్డారని రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఆధారాలను సేకరిస్తున్నామని  తెలిపారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ ఉన్నతాధికారులతో మంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలోని శాప్ సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా తయారు చేస్తామని, అందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
 
అమరావతి పేరుతో వచ్చే ఐదేళ్లలో ఐపీఎల్ క్రికెట్ జట్టును ప్రమోట్ చేయనున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గల్లీ నుండి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు క్రీడల ప్రోత్సాహానికి కృషి చేస్తామని తెలిపారు. క్రీడాకారులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించి వారిలో క్రీడాసక్తి పెంపొందించి ఉత్తమ క్రీడాకారులుగా రాణించేలా చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా అవసరమైన క్రీడా మైదానాలు, స్టేడియంల నిర్మాణానికి పెద్దపీట వేస్తామన్నారు. క్రీడా వికాస కేంద్రాలు, గ్రామ స్థాయిలో క్రీడల నిర్వహణ, ప్రోత్సాహంపై సీఎంతో చర్చిస్తామన్నారు.
 
అలాగే క్రీడాకారులకు నకిలీ సర్టిఫికెట్ల వల్ల నష్టం జరుగుతుందని తమ దృష్టికి వచ్చిందని, సర్టిఫికెట్ల కుంభకోణంపై విచారణ చేసి అసలైన క్రీడాకారులకు పూర్తి న్యాయం చేస్తామన్నారు. క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు అనే తేడా లేకుండా విద్యార్థులు ఆడుకోవడానికి ఒక గంట సమయం కేటాయించేలా టైం టేబుల్ ఏర్పాటు ఉండేలా ఆదేశాలు ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే క్రీడామైదానాలు లేని ప్రైవేటు పాఠశాలలకు నోటీసులు ఇస్తామని, అవసరమైతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News