Retail inflation: ఐదేళ్ల కనిష్ఠానికి దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం

Retail inflation fell to Reserve Bank 4 per cent target for the first time in nearly five years

  • జులైలో 3.54 శాతంగా నమోదు
  • ఆహార పదార్థాల రేట్లు తగ్గుదలతో తగ్గిన ద్రవ్యోల్బణం
  • గణాంకాలు ప్రకటించిన కేంద్రం

దాదాపు ఐదేళ్ల సుదీర్ఘకాలం తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్య పరిమితికి దిగువన నమోదయింది. జులై నెలలో వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 3.54 శాతానికి తగ్గిందని కేంద్రం వెల్లడించింది. చాలాకాలం తర్వాత ఆర్బీఐ లక్ష్య పరిమితి 4 శాతానికి దిగువకు దిగివచ్చినట్టు తెలిపింది. 

జులైలో 3.54 శాతంగా నమోదైన రిటైల్ ద్రవ్యోల్బణం అంతక్రితం నెల జూన్ 2024లో 5.08 శాతంగా ఉంది. ఇక గతేడాది జులైలో 7.44 శాతంగా ఉందని ఎన్‌ఎస్‌వో ప్రస్తావించింది. 

ఇక, ఆహార పదార్థాల ధరల్లో తగ్గుదల ద్రవ్యోల్బణం దిగిరావడానికి దోహదపడిందని పేర్కొంది. ఆహార ధరల ద్రవ్యోల్బణం జూన్‌లో 8.36 శాతంగా ఉండగా జులైలో 5.42 శాతానికి తగ్గిందని పేర్కొంది. ఈ మేరకు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్‌వో) తాజాగా గణాంకాలు విడుదల చేసింది. 

జూన్‌లో ఆహార పదార్థాల ధరలు మండిపోవడంతో ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 8.36 శాతానికి పెరిగింది. 2023లో ఇదే జూన్ నెలలో 4.63 శాతంతో పోలిస్తే రెట్టింపు అయ్యింది. 

కాగా 2019 సెప్టెంబరులో చివరిసారిగా రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం కంటే తక్కువగా నమోదయింది. ఆర్బీఐ లక్ష్య పరిమితి 4 శాతంగా ఉంటుంది. ఇరువైపులా 2 శాతం మార్జిన్‌తో ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ చర్యలు తీసుకుంటుంది.

  • Loading...

More Telugu News