Adi Srinivas: రేవంత్ రెడ్డి పర్యటనపై నోటికొచ్చినట్టు కూస్తున్నారు: ఆది శ్రీనివాస్

Adi Srinivas fires at BRS over Revanth Reddy US tour

  • రేవంత్ రెడ్డి బృందం అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేసిందన్న శ్రీనివాస్
  • రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్య
  • బుర్రలేని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని ఆగ్రహం

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై బీఆర్ఎస్ వాళ్లు సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు కూస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి బృందం అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేసిందన్నారు. తెలంగాణను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చుతున్నారన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సాగుతున్న ఈ పర్యటన విజయవంతం కావడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోందన్నారు.

బీఆర్ఎస్ హయాంలో సూటుబూటు వేసుకొని వెళ్లిన కేటీఆర్ ఎన్ని కంపెనీలను తీసుకు వచ్చాడో చెప్పాలని ప్రశ్నించారు. నాడు కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎంవోయూలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని విమర్శించారు. ఒప్పందం చేసుకున్న కంపెనీలకు గత ప్రభుత్వం సరైన వసతులు కల్పించలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పర్యటనను తక్కువ చేసి చూపించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని ధ్వజమెత్తారు.

బుర్రలేని వాళ్లు కేటీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారన్నారు. తమ హయాంలో అంగుళం భూమి కేటాయించకముందే మనీలాండరింగ్ ఆరోపణలు చేయడం దారుణమన్నారు. కేటీఆర్ పదేళ్ల పాటు సూటుబూటు వేసుకొని హడావుడి చేస్తే రేవంత్ రెడ్డి 8 నెలల కాలంలోనే సమాధానం చెప్పారన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు ఉద్యోగాల కల్పన కోసం తాము ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. తెలంగాణ అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యమన్నారు.

మూడుసార్లు దావోస్ వెళ్లిన కేటీఆర్ ఎన్ని కంపెనీలు తీసుకువచ్చారో చెప్పాలని నిలదీశారు. విదేశీ పర్యటనల పేరుతో దుబాయ్ వెళ్లి బిల్డింగ్‌లు కొనుక్కున్న వారితో రేవంత్ రెడ్డికి పోలికనా? అని మండిపడ్డారు. కేటీఆర్ ఇచ్చిన స్క్రిప్ట్ చదివి దిగజారవద్దని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. తమ ప్రభుత్వం ఇలాగే పని చేస్తే బీఆర్ఎస్ పని ఖతమవుతుందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు.

Adi Srinivas
Congress
Social Media
BRS
  • Loading...

More Telugu News