Maha Ganapati: ముస్తాబవుతున్న ఖైరతాబాద్ మహా గణపతి
- ఖైరతాబాద్ లో 70 అడుగుల మట్టి వినాయకుడు
- తుది దశకు చేరుకున్న నిర్మాణ పనులు
- సప్తముఖ మహా శక్తి గణపతిగా భక్తులకు దర్శనం
ఖైరతాబాద్ లో మహా గణపతి ప్రతిష్ఠాపన కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది 70 అడుగుల మట్టి వినాయకుడు సప్త ముఖ మహా శక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఏడు ముఖాలు, ఏడు సర్పాలు, 24 చేతులతో గణపతిని తీర్చిదిద్దుతున్నట్లు గణేశ్ ఉత్సవ కమిటీ పేర్కొంది. లంబోదరుడికి కుడి వైపున శ్రీనివాస కల్యాణం, ఎడమ వైపున శివ పార్వతుల కల్యాణంతో పాటు అయోధ్య బాల రాముడి ప్రతిమను కూడా ఏర్పాటు చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
ఒడిశాకు చెందిన కళాకారుడు జోగారావుకు ఈసారి మహా గణపతి రూపకల్పన బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. శోభాయాత్ర సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విగ్రహ నిర్మాణంలో అవసరమైన మార్పులు చేస్తున్నట్లు జోగారావు తెలిపారు. జూన్ లోనే పనులు ప్రారంభించామని, విగ్రహ నిర్మాణంలో 22 టన్నుల పైచిలుకు ఐరన్ ను వినియోగిస్తున్నామని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తుంటారు. రాష్ట్రం నలుమూలల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు వివరించారు. గతేడాది మహా గణపతిని 35 లక్షల పైచిలుకు భక్తులు దర్శించుకున్నారని, ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని చెప్పారు.