Chittoor District: చిత్తూరు జిలాల్లో నాటు బాంబుల కలకలం

Bombs planted in Chittoor districts

  • పాకాల మండలంలో 26 నాటు బాంబుల స్వాధీనం 
  • నాటు బాంబులు తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు
  • అడవి పందుల వేటకే ఈ నాటుబాంబులని చెబుతున్న నిందితులు

ఉమ్మడి చిత్తూరు జిల్లా పాకాల మండలంలో నాటు బాంబులు కలకలాన్ని రేపాయి. పాకాల మండలం చెన్నుగారిపల్లె పంచాయతీ మణిపిరెడ్డిపల్లెలో పోలీసులు నాటు బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రైల్వే గేటు సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన ఓ ఇంట్లో ఆదివారం 26 నాటు బాంబులను పోలీసులు గుర్తించారు. నాటు బాంబులను తయారు చేస్తున్న బాబు, గజేంద్రలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో నిందితులు ఆ నాటు బాంబులు ఎందుకు తయారు చేస్తున్నారు అనే విషయాన్ని వెల్లడించారు.
 
పందుల పెంపకం, అడవి పందుల మాంసం విక్రయాలపై జీవనం సాగిస్తున్న తాము అడవి పందులను వేటాడటానికి నాటు బాంబులు తయారు చేస్తున్నట్లు చెప్పినట్లు సమాచారం. వారు తయారు చేసిన నాటు బాంబులను అడవి పందులు సంచరించే ప్రదేశాల్లో పెడితే అవి తినే ప్రయత్నం చేసినప్పుడు, అవి పేలి అడవి పంది గాయపడుతుంది. ఆ తర్వాత గాయపడిన పందిని వారు స్వాధీనం చేసుకుని, దాని మాంసాన్ని విక్రయిస్తున్నట్లు పోలీసులకు నిందితులు తెలిపారు. అయినప్పటికీ కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.

More Telugu News