Telangana: తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు... ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Another two days rain in telangana

  • పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడి
  • భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
  • వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూచన

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని తెలిపింది.

హైదరాబాద్‌లో రేపు ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం తర్వాత జల్లులు కురిసే అవకాశముందని తెలిపింది. మధ్యాహ్నం కాస్త ఎండ వచ్చినప్పటికీ సాయంత్రానికి వాతావరణం చల్లబడి జల్లులు కురిసే అవకాశముందని వెల్లడించింది.

  • Loading...

More Telugu News