Harish Rao: బీజేపీకి ఆంధ్రా తీపి అయితే... తెలంగాణ చేదు అయిందా?: హరీశ్ రావు ఆగ్రహం

Harish Rao blames bjp comparing with AP

  • తెలంగాణకు కాంగ్రెస్, బీజేపీలు తీరని అన్యాయం చేశాయని విమర్శ
  • ఆరు గ్యారెంటీల పేరుతో అబద్దాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న మాజీ మంత్రి
  • రెండు పిల్లర్లు కూలితే కాళేశ్వరమే కూలినట్లు ప్రచారం చేశారని మండిపాటు

బీజేపీకి ఆంధ్రా తీపి అయితే.. తెలంగాణ చేదు అయిందా? అని ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు కాంగ్రెస్, బీజేపీలు తీరని అన్యాయం చేశాయని విమర్శించారు. సిద్దిపేటలో సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్, బీజేపీ తెలంగాణను దారుణంగా మోసం చేశాయన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో అబద్దాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలకు చెరో 8 ఎంపీ సీట్లను ఇస్తే తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఏ హామీని అమలు చేయడం లేదని విమర్శించారు. మహిళలకు రూ.2500, పెన్షన్ పెంపు వంటి హామీలను నెరవేర్చలేదన్నారు. బెల్ట్ దుకాణాలను బంద్ చేస్తానన్న కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ గల్లీకో బెల్ట్ దుకాణం తెరిచిందన్నారు. మద్యం విషయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విమర్శలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడేం చేస్తుందని నిలదీశారు. మద్యంపై బడ్జెట్‌లో గత ఏడాది కంటే ఈసారి రూ.7,300 కోట్లు ఎక్కువగా పెంచారన్నారు.

ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఆ హామీ ఎక్కడకు పోయిందో చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలిపోతే కాళేశ్వరం ప్రాజెక్టే కూలిపోయినట్లుగా ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కూలిపోతే రంగనాయకసాగర్‌లోకి నీళ్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు.

  • Loading...

More Telugu News