KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అమరరాజా వార్నింగ్... సీఎంకు కేటీఆర్ విజ్ఞప్తి

KTR urges CM Revanth Reddy after Amararaja warning

  • ప్రభుత్వ హామీలను పెడచెవిన పెడితే ప్లాంట్ విస్తరణ ప్రణాళిక నిలిపేస్తామన్న అమరరాజా
  • పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశిస్తున్నానన్న కేటీఆర్
  • రాజకీయ విభేదాలతో తెలంగాణకు నష్టం జరగకూడదని వ్యాఖ్య

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా మాట్లాడవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పదేపదే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అంటున్నారని, ఇలా అనడం సరికాదన్నారు. రాజకీయ విభేదాలతో తెలంగాణకు నష్టం జరగకూడదని సూచించారు. పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలతో తెలంగాణలో సెల్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, కానీ ఈ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవిన పెడితే మాత్రం ప్లాంట్ విస్తరణ ప్రణాళికను నిలిపివేస్తామని అమరరాజా బ్యాటరీ అండ్ మొబిలిటీ చైర్మన్ గల్లా జయదేవ్ హెచ్చరించినట్లుగా వార్తలు రావడంపై కేటీఆర్ స్పందించారు. ఇందుకు సంబంధించిన వార్తను ట్వీట్ చేస్తూ... ప్రభుత్వానికి సూచన చేశారు.

తెలంగాణలో రూ.9500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకుగాను అమరరాజాను ఒప్పించేందుకు ఎంతో కష్టపడ్డామని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం అనేది పాలసీ కొనసాగింపును నిర్ధారించాల్సిన సంస్థగా వ్యవహరించాలని... కానీ రాజకీయ విభేదాల వల్ల తెలంగాణ బాధపడకూడదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడిదారులందరికీ గౌరవం ఇస్తుందని ఆశిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

వాస్తవానికి దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన శక్తివంతమైన రెవెన్యూ మిగులు రాష్ట్రంగా తెలంగాణ ఉందని, కానీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ముఖ్యమంత్రి అనడం సరికాదన్నారు. ఇప్పటికే కేన్స్ టెక్నాలజీ తెలంగాణ నుంచి గుజరాత్‌కు వెళ్లిపోవడం, కార్నింగ్ ప్లాంట్‌ను చెన్నైకి పోగొట్టుకోవడం చూశామని, ఇప్పుడు అమరరాజా వెళ్లిపోతే అది విపత్తుతో సమానమని హెచ్చరించారు.

KTR
Revanth Reddy
Amara Raja
Telangana
  • Loading...

More Telugu News