Tungabhadra Dam: కొట్టుకుపోయిన తుంగభద్ర గేటు.. కర్నూలు జిల్లా ప్రజలకు అలర్ట్

Tungabhadra dam gates chain snaps causing sudden outflow of 35000 cusec water

  • డ్యామ్ గేట్లు మూసివేస్తుండగా తెగిన చైన్
  • కర్నూలు జిల్లా ప్రజలకు అధికారుల హెచ్చరిక
  • మంత్రి పయ్యావులకు సీఎం చంద్రబాబు ఫోన్

కర్ణాటకలోని హోస్పేట సమీపంలో ఉన్న తుంగభద్ర డ్యామ్ గేటు ఒకటి కొట్టుకుపోయింది. శనివారం రాత్రి డ్యామ్ గేట్లు మూసివేస్తుండగా చైన్ తెగి 19వ నంబర్ గేటు ఊడిపోయింది. దీంతో నీరు భారీగా కిందకి వస్తోంది. ఇటీవలి వరదలకు డ్యామ్ కు వరద పోటెత్తింది. దీంతో అధికారులు మొత్తం 33 గేట్లు ఎత్తి నీటిని వదిలారు. శనివారం వరద తగ్గడంతో గేట్లు మూసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే 19వ నంబర్ గేటు ఊడిపోయిందని అధికారులు వెల్లడించారు. దీంతో 35 వేల క్యూసెక్కుల నీరు కిందికి వెళుతోందని చెప్పారు.

డ్యామ్ గేటు ఊడిపోవడంతో ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కౌతాలం, కోస్గి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలపై ప్రభావం ఉండవచ్చని పేర్కొంది. సహాయం కోసం 1070 112, 1800 425 0101 నంబర్‌కు కాల్ చేయాలని కోరింది. అయితే, గేటును పునరుద్ధరించేందుకు కర్ణాటక అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. డ్యామ్ లో నుంచి 60 టీఎంసీల నీటిని బయటకు పంపాక గేటును అమర్చుతామని ప్రకటించారు. కాగా, డ్యామ్ గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసి కర్ణాటక మంత్రి శివరాజ్ ఆదివారం ఉదయం తుంగభద్ర డ్యామ్ వద్దకు వెళ్లి పరిశీలించారు.

మంత్రులు, అధికారులకు చంద్రబాబు ఫోన్
తుంగభద్ర డ్యామ్‌ గేటు కొట్టుకుపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. డ్యామ్ వద్దకెళ్లి పరిస్థితిని గమనించాలని, అక్కడి పరిస్థితిని తనకు వివరించాలని కర్నూలు సీఈ, విజయవాడ సెంట్రల్ డిజైన్స్ కమిషనర్, జాతీయ డ్యామ్ గేట్ల నిపుణులు కన్నం నాయుడిని ఆదేశించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. తాత్కాలిక గేటు ఏర్పాటుపై డ్యామ్‌ అధికారులతో మాట్లాడాలని, అందుకు అవసరమైన సహకారం అందించాలని మంత్రి పయ్యావుల కేశవ్‌ను చంద్రబాబు ఆదేశించారు. అయితే, పాత డిజైన్‌ కావడం వల్ల స్టాప్‌లాక్‌ గేట్‌ ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉందని మంత్రి తెలిపారు.

  • Loading...

More Telugu News