Grama Sabhalu: ఆగస్టు 15 నుంచి ఏపీలో రెవెన్యూ గ్రామ సభలు

Grama Sabhalu In AP From August 15th

  • భూ అక్రమాలు, రెవెన్యూ సమస్యలపై అర్జీలు స్వీకరణ
  • ప్రతి అర్జీపై విచారణ జరిపి తగిన పరిష్కారం చూపుతున్నామన్న మంత్రి అనగాని
  • పెద్ద గ్రామాల్లో రోజంతా, చిన్న గ్రామంలో సగం రోజు సభలు

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. 15న లాంఛనంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. పెద్ద రెవెన్యూ గ్రామాల్లో రోజంతా, చిన్న రెవెన్యూ గ్రామాల్లో సగం రోజు సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు.

 ఈ సదస్సుల్లో భూ ఆక్రమణలు, 22ఏ భూముల అక్రమాలతో పాటు అన్ని రెవెన్యూ సంబంధిత సమస్యలపై అధికారులు అర్జీలు స్వీకరిస్తారని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామానికి తహశీల్దార్ తో పాటు ఏడుగురు అధికారులు వచ్చి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు. ప్రతి అర్జీని ఆన్ లైన్ చేసి.. దానిపై విచారణ జరిపి తగిన పరిష్కారం చూపుతారని మంత్రి వెల్లడించారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాదర్భార్‌లో నిత్యం పెద్ద ఎత్తున భూ ఆక్రమణలపై ఫిర్యాదులు అందుతుండటంతో త్వరలో నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లోనూ వీటిపై అత్యధికంగా ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్టీ కార్యాలయానికి వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం వైసీపీ హయాంలో జరిగిన భూ ఆక్రమాలపైనే వస్తున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.

More Telugu News