Rahul Dravid: భారత జట్టు కోచింగ్ కెరీర్‌లో అత్యల్ప స్థితి ఎప్పుడు ఎదురైందో బయటపెట్టిన రాహుల్ ద్రావిడ్

I would say that the South Africa Test series early on in my career is lowest point says Rahul Dravid

  • కెరీర్ ఆరంభంలో దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓడిపోవడం అత్యుల్ప స్థితి అని వ్యాఖ్య
  • మొదటి టెస్టు గెలిచి.. మిగతా రెండూ ఓడిపోయామన్న ద్రావిడ్
  • స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ కోచ్

భారత జట్టు మాజీ ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం అత్యున్నత స్థితిలో ముగిసింది. భారత జట్టు టీ20 వరల్డ్ కప్ 2024ను గెలవడంతో అతడికి అద్భుతమైన వీడ్కోలు లభించింది. అయితే కోచింగ్ కెరీర్‌లో అత్యల్ప స్థితి ఏదో ద్రావిడ్ తాజాగా వెల్లడించాడు. కోచింగ్ కెరీర్ ఆరంభంలో 2021-22 సీజన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను భారత్ కోల్పోవడం తనకు అత్యల్ప స్థితి అని అభివర్ణించాడు.

స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘‘కోచ్‌గా అత్యల్ప స్థితి ఏమిటని నన్ను అడిగితే.. ఆరంభంలో దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ అని చెబుతాను. సెంచూరియన్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో మనం గెలిచాం. ఆ తర్వాత రెండవ, మూడవ టెస్టులను దక్షిణాఫ్రికా గెలుచుకుంది. ఆ సిరీస్‌ను గెలిచే అవకాశం మాకు ఉన్నా గెలవలేకపోయాం. మ్యాచ్‌ల్లో బాగా రాణించినా చేజారిపోయాయి’’ అని ద్రావిడ్ చెప్పాడు.

రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు కొందరు ఆ సిరీస్‌కు దూరమయ్యారని గుర్తుచేసుకున్నారు. భారత్‌ను దక్షిణాఫ్రికా తక్కువ స్కోర్లకే పరిమితం చేసి లక్ష్యాలను సులభంగా ఛేదించిందని ప్రస్తావించాడు. ‘‘రోహిత్ శర్మ గాయపడ్డాడు. కొందరు సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో లేరు. అయినప్పటికీ మన జట్టు బాగా రాణించింది. సిరీస్‌లో ముందంజలో ఉన్నా ఓడిపోయాం’’ అంటూ ద్రావిడ్ గుర్తుచేసుకున్నాడు.

కాగా 2021-22లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించింది. దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌లో దక్కించుకునే అవకాశం ఉన్నా అనూహ్య రీతిలో భారత్ సిరీస్‌ను కోల్పోయింది. సెంచూరియన్‌ వేదికగా జరిగిన మొదటి టెస్టులో  భారత్ 113 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో ఆధిపత్యం చెలాయించడం ఖాయమని అంతా భావించారు. కానీ తర్వాతి రెండు టెస్టుల్లో భారత్ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ తొలుత భారత్ ఆధిపత్యం చెలాయించినా ఆ తర్వాత పట్టు కోల్పోయి మ్యాచ్‌లను చేజార్చుకున్నారు. టెస్టు కెప్టెన్‌గా విరాట్‌కి ఇదే చివరి సిరీస్ కావడం విశేషం.

More Telugu News