Telangana Cabinet: రేషన్ కార్డుల జారీపై కీలక భేటీ... రెండు రాష్ట్రాల్లో కార్డు ఉంటే ఆప్షన్ ఇచ్చే అవకాశం

Cabinet sub committee meeting on ration card

  • గ్రామీణ ప్రాంతాల్లో రూ.1 లక్ష ఆదాయం ఉన్న వారికి తెల్ల రేషన్ కార్డు!
  • రేషన్ కార్డుపై అన్ని పార్టీలు, ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకోవాలని నిర్ణయం
  • సక్సేనా కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుంటామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

రెండు రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఉన్నవారికి ఆప్షన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెల్ల రేషన్ కార్డుల పంపిణీకి విధివిధానాలపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సందర్భంగా రేషన్ కార్డుల జారీపై చర్చించింది.

గ్రామీణ ప్రాంతాల్లో రూ.1 లక్ష ఆదాయం లేదా 3.50 ఎకరాల మాగాణి లేదా 7.5 ఎకరాల లోపు చెలక ఉన్న వారిని తెల్ల రేషన్ కార్డుకు ఎంపిక చేయాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించింది. పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల గరిష్ఠ వార్షికాదాయం ఉన్న వారిని అర్హులుగా చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

అన్ని పార్టీలు, ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకోవాలని ఉపసంఘం నిర్ణయించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు లేఖలు రాసి సూచనలు తీసుకోవాలని నిర్ణయించింది. కేబినెట్ సబ్ కమిటీ భేటీ అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... సక్సేనా కమిటీ సిఫార్సులను రేషన్ కార్డుల మంజూరుకు పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 89 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయని, పది లక్షల కార్డులు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News