Vinesh Phogat: నాదీ 50 గ్రాముల అధిక బరువు బాధే: స్వర్ణం గెలిచిన జపాన్ రెజ్లర్
- వినేశ్ ఫొగాట్ బాధను అర్థం చేసుకోగలనన్న రేయ్ హిగుచి
- 2020లో సొంత దేశంలో టోక్యో ఒలింపిక్స్‌లో హిగుచిపై అనర్హత వేటు
- ఎదురుదెబ్బల నుంచి నేర్చుకొని ప్రయాణించాలని సూచన
'నీ బాధను నేను అర్థం చేసుకోగలను... గతంలో నాదీ 50 గ్రాముల బాధనే' అంటూ జపాన్ రెజ్లర్ రేయ్ హిగుచి భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ను ఓదార్చాడు. 200 గ్రాములు అధికంగా ఉండటంతో ప్యారిస్ ఒలింపిక్స్ 50 కిలోల కుస్తీ పోటీల్లో ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. దీంతో రాజకీయ ప్రముఖులు మొదలు అంతర్జాతీయ క్రీడాకారులు ఆమెను ఓదారుస్తున్నారు.
వినేశ్ ఫొగాట్ రిటైర్మెంట్ పోస్ట్‌పై స్పందించిన రేయ్ హిగుచి 'నీ బాధను నేను అర్థం చేసుకోగలను. నాదీ 50 గ్రాముల బాధనే. ఇప్పుడు నీ చుట్టూ వినిపిస్తున్న మాటల గురించి ఆందోళన వద్దు. జీవితం ఇలా సాగుతూనే ఉంటుంది. ఎదురుదెబ్బల నుంచి నేర్చుకొని ఎదిగిన ప్రయాణం ఎంతో అందంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకో' అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు.
రేయ్ హిగుచి 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు. 2020లో సొంత దేశంలో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో 50 గ్రాముల అధిక బరువు కారణంగా క్వాలిఫికేషన్ పోరులో అనర్హతకు గురయ్యాడు. అయితే తాజా, ప్యారిస్ ఒలింపిక్స్‌లో అతను స్వర్ణం సాధించాడు. 57 కిలోల విభాగంలో అమెరికా రెజ్లర్‌పై గెలిచాడు.