Paris Olympics: కొవిడ్ సోకినా పోటీలో పాల్గొని స్వర్ణం గెలిచిన అథ్లెట్
- ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో కొవిడ్ పంజా
- వైరస్ తో బాధపడుతూనే పోటీల్లో పాల్గొన్న పలువురు ఆటగాళ్లు
- కొవిడ్ కారణంగా ఏడాది ఆలస్యంగా జరిగిన టోక్యో ఒలింపిక్స్
పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో కొవిడ్ విస్తరిస్తోందని తాజాగా బయటపడింది. క్రీడా గ్రామంలో ఉంటున్న పలువురు ఆటగాళ్లు వైరస్ బారిన పడ్డారని సమాచారం. ఓవైపు వైరస్ తో బాధపడుతూనే పోటీల్లో పాల్గొన్నారని, 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం గెలిచిన నోవాలైల్స్ కు అప్పటికే కొవిడ్ సోకిందని అధికార వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు, బ్రిటన్ స్టార్ స్విమ్మర్ ఆమ్ పీటే కూడా వైరస్ సోకినప్పటికీ పోటీల్లో పాల్గొని సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడని తెలిపాయి. క్రీడాకారుల్లో 40 మందికిపైగా కొవిడ్ సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే, అందులో చాలా తక్కువ మందే మాస్క్ ధరించి తగు జాగ్రత్తలు తీసుకున్నారని వివరించింది.
పారిస్ ఒలింపిక్స్‌ను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున హాజరైన స్థానికులు అథ్లెట్లతో చేతులు కలుపుతూ హర్షం వ్యక్తంచేశారు. దీంతో కొవిడ్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, కొవిడ్‌ను పెద్ద సమస్యగా భావించక్కర్లేదని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బాక్ వ్యాఖ్యానించారు. ఇది కూడా ఓ జ్వరం లాంటిదేనని.. ఇందుకోసం ప్రత్యేకంగా ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. క్రీడా గ్రామాల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నట్లు తెలిపారు. అథ్లెట్లకు ఎలాంటి ఖర్చు లేకుండానే వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
కొవిడ్ సోకినా పోటీలో పాల్గొన్న నోవాలైల్స్ 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం గెలిచాడు. ఆ తర్వాత 200 మీటర్ల విభాగంలో వెనకబడి కాంస్యంతో సరిపెట్టుకొన్నాడు. పోటీ పూర్తయ్యాక అలసటతో నోవాలైల్స్ వీల్‌చైర్‌కు పరిమితమయ్యాడు. ఈ సందర్భంగా మాస్క్ ధరించి మిగతా వారికి దూరంగా ఉన్నాడు. బ్రిటన్ స్టార్ స్విమ్మర్ ఆమ్ పీటే కూడా కొవిడ్ బారినపడిన 24 గంటల్లోనే సిల్వర్ పతకం సాధించాడు.
కొవిడ్ కారణంగా టోక్యో ఒలింపిక్స్ ఏడాది ఆలస్యంగా జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి భారీగా ఆంక్షలు విధించారు. తాజాగా పారిస్ ఒలింపిక్స్ లో మాత్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలుస్తోంది. కొవిడ్ కారణంగా ప్రాణాపాయం జరిగే అవకాశం లేదనే ఉద్దేశంతో వైరస్ బారిన పడిన ఆటగాళ్లను పోటీ నుంచి తప్పించలేదని నిర్వాహకులు చెప్పారు.