AP Spl Police: జగన్ అన్యాయం చేశారు.. మీరైనా న్యాయం చేయండి: ఏపీ మాజీ స్పెషల్ పోలీసులు
- జోరు వానలోనూ తిరుపతి కలెక్టరేట్ ముందు ప్లకార్డులతో ధర్నా
- తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్
- ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీని గుర్తుచేసిన సిబ్బంది
ఎలాంటి నోటీసు లేకుండా గత ప్రభుత్వం తమను ఉన్నట్టుండి విధుల నుంచి తొలగించిందని ఏపీ మాజీ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ (సివిల్స్) వాపోయారు. రెండేళ్ల వెట్టిచాకిరీ తర్వాత జగన్ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని, కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం తిరుపతి కలెక్టరేట్ ముందు వారంతా ధర్నా చేశారు. ఓవైపు జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేశారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లకు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 జనవరి 2న రాష్ట్రవ్యాప్తంగా 2156 మందిని ఎస్పీఓలుగా నియమించిందని ఏపీ ఎస్పీఓల సంఘం రాష్ట్ర నాయకులు ధర్మ చంద్, చిట్టిబాబు చెప్పారు. నాటి ముఖ్యమంత్రి జగన్ ఇందుకోసం ప్రత్యేక జీవో జారీ చేశారని వివరించారు. తమను బార్డర్ చెక్ పోస్టులు, నార్కోటిక్, ఉమెన్ ట్రాఫికింగ్ విభాగాల్లో నియమించి విధులు అప్పగించారని తెలిపారు. రెండేళ్ల పాటు రాష్ట్రంలో ఎర్రచందనం, గంజాయి, ఉమెన్ ట్రాఫికింగ్‌ను అరికట్టామని వారు చెప్పారు. అయితే, 2022 మార్చి 31న ప్రభుత్వం ఎస్పీఓలు అందరినీ తొలగించిందని వాపోయారు. తమను విధుల్లోకి తీసుకోవాలంటూ అప్పట్లో సీఎం జగన్, మంత్రుల పేషీల చుట్టూ తిరిగినా కూడా న్యాయం జరగలేదని చెప్పారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెలలు గడుస్తున్నా తమ సమస్యను పట్టించుకోలేదని ధర్మ చంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీఓలు విధుల్లో లేకపోవడంతో గల్లీగల్లీలోనూ గంజాయి దొరుకుతోందని, ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకునే వారే లేకుండా పోయారని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పే కూటమి ప్రభుత్వం కూడా చేయకూడదని అభ్యర్థించారు. అక్రమ రవాణాకు, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు వెంటనే తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ధర్మ చంద్, చిట్టిబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.