Chandrababu: కూటమి అభ్యర్థి ఎంపిక కోసం ఆరుగురితో కమిటీ వేసిన సీఎం చంద్రబాబు

CM Chandrababu appoint a committee for Visakha MLC election
  • త్వరలో విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
  • ఇప్పటికే బొత్సను అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ
  • కూటమి అభ్యర్థి ఎంపిక కోసం చంద్రబాబు కసరత్తులు
  • నేడు విశాఖ నేతలతో కీలక సమావేశం
త్వరలో విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో, కూటమి అభ్యర్థి ఎంపిక కోసం సీఎం చంద్రబాబు కసరత్తులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో పరిస్థితుల అధ్యయనానికి ఆరుగురితో కమిటీ వేశారు. 

కమిటీ సభ్యులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, హోంమంత్రి అనిత, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ... జనసేన నుంచి పంచకర్ల రమేశ్, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు ఉన్నారు.

విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీ చేసే కూటమి అభ్యర్థి ఎంపిక కోసం చంద్రబాబు నేడు విశాఖ నేతలతో సమావేశమయ్యారు. కూటమి అభ్యర్థి ఎంపిక కోసం వారి నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీల బలాబలాలపై చర్చించారు. 

ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ క్యాంపులు ఏర్పాటు చేసిందని... ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఆ క్యాంపులకు తరలించారని టీడీపీ నేతలు చంద్రబాబుకు తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైనా సరే గెలిపిస్తామని వారు భరోసా ఇచ్చారు. ఇప్పటికే చాలామంది కూటమికి మద్దతు పలికారని వివరించారు.

క్షేత్రస్థాయి పరిస్థితులను నివేదించాలని చంద్రబాబు వారికి సూచించారు. విశాఖ నేతలతో చంద్రబాబు సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. త్వరలోనే విశాఖ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.
Chandrababu
Visakha MLC election
Alliance Candidate
TDP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News