Neeraj Chopra: ఈవెంట్ తర్వాత నదీమ్‌ను పలకరించిన నీరజ్ చోప్రా.. నెట్టింట వీడియో వైరల్!
![Neeraj Chopra Interacts With Arshad Nadeem After Pakistan Star Wins Gold in Men Javelin Throw at Paris Olympics 2024](https://imgd.ap7am.com/thumbnail/cr-20240809tn66b59ad492d28.jpg)
- 89.45 మీటర్లు ఈటెను విసిరి సత్తా చాటిన నీరజ్ చోప్రా
- జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం విసిరి గోల్డ్ గెలిచిన అర్షద్ నదీమ్
- ఈవెంట్ తర్వాత నదీమ్‌ను మెచ్చుకున్న నీరజ్
- ఇద్దరు ఛాంపియన్ల తాలూకు వీడియో సోషల్ మీడియాలో హల్చల్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా గురువారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. ఈటెను 89.45 మీటర్లు విసిరి రజత పతకం కైవసం చేసుకున్నాడు. వరుసగా రెండవ ఒలింపిక్స్‌లోనూ పతకాన్ని గెలుచుకుని రికార్డు సృష్టించాడు. ఇక ఇదే ఈవెంట్లో దాయాది పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ అనూహ్య రీతిలో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు.
అర్షద్ జావెలిన్‌ను ఏకంగా 92.97 మీటర్ల దూరం విసిరి మొదటి స్థానంలో నిలిచి స్వర్ణ పతకం దక్కించుకున్నాడు. అలాగే ఒలింపిక్ చరిత్రలో సరికొత్త రికార్డు కూడా నెలకొల్పాడు. ఇంతకుముందు ఉన్న ఒలింపిక్ రికార్డు 90.57 మీటర్లను నదీమ్ (92.97 మీ) అధిగమించాడు.
అయితే, ఈవెంట్ ముగిసిన తర్వాత ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒకరిని ఒకరు పలకరించుకున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. నదీమ్‌ను నీరజ్ మెచ్చుకోవడం వీడియోలో కనిపించింది. అలాగే ఇద్దరూ ఏదో మాట్లాడుకోవడం కూడా వీడియోలో ఉంది. ఇలా ఇద్దరూ ఒకరికి ఒకరు కంగ్రాట్స్ చెప్పుకున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక 2021 టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా బల్లెంను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని గెలిచిన విషయం తెలిసిందే. కానీ, నిన్నటి ఫైనల్లో మరోసారి ఇదే ఫీట్‌ను రిపీట్ చేయలేకపోయాడు. దీనికి కారణం ఈసారి నీరజ్ గాయంతో బరిలోకి దిగడం. లేనిపక్షంలో భారత్ ఖాతాలో రెండో గోల్డ్ చేరేది.
కాగా, ఈసారి ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు తీవ్రంగా నిరాశపరిచారు. తప్పకుండా మెడల్ వస్తుందనుకున్న ఈవెంట్లలో మనోళ్లు విఫలమయ్యారు. ఇప్పటివరకు మనకు కేవలం ఐదు పతకాలు (ఒక రజతం, 4 కాంస్యాలు) మాత్రమే దక్కాయి.