Maoists: జనజీవన స్రవంతిలోకి ఇద్దరు మావోయిస్టులు

Two Maoists voluntarily surrendered to the police in Bhadradri district

  • భద్రాద్రి జిల్లాలో పోలీసుల వద్ద స్వచ్చందంగా లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు
  • మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
  • మావోయిస్టుల లొంగుబాటుకు ‘ఆపరేషన్ చేయూత’ నిర్వహిస్తున్న భద్రాద్రి పోలీసులు

మారుతున్న రాజకీయ పరిణామాలు, వ్యక్తిగత అనారోగ్య సమస్యలు, కుటుంబ సభ్యుల ఒత్తిడి, పోలీసుల విస్తృత గాలింపు చర్యలు తదితర కారణాలతో పలువురు మావోయిస్టులు ఉద్యమ బాట వీడి జన జీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. స్వచ్చందంగా లొంగిపోతున్న మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి ఆర్ధిక తోడ్పాటుతో పాటు కేసుల నుంచి విముక్తి లభిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇద్దరు మావోయిస్టు పార్టీ దళ సభ్యులు భద్రాద్రి జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ 141వ, 81వ బెటాలియన్ల అధికారుల సమక్షంలో స్వచ్చందంగా లొంగిపోయారు. తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ శబరి ఏరియా కమిటీ సభ్యుడు వెట్టి లక్ష్మయ్య అలియాస్ కల్లు, చత్తీస్‌గఢ్ రాష్ట్ర మావోయిస్టు పార్టీ గొల్లపల్లి ఏరియా స్క్వాడ్ (ఎల్వోఎస్) సభ్యుడు మలం దేవా పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ మేరకు గురువారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వివరాలను వెల్లడించారు.

లొంగిపోయిన మావోయిస్టు లక్ష్మయ్యది చర్ల మండలం కిష్టారంపాడు గ్రామం. 2021లో చర్ల – శబరి ఏరియా కమిటీ మిలీషియా కమాండర్ వెట్టి దేవా అలియాస్ బాలు వద్ద మిలీషియా సభ్యుడిగా చేరాడు. అతడి వద్దే ఉంటూ పార్టీకి నిత్యావసర సరుకులు అందించడం, పార్టీ ఆదేశించిన పనులు చేస్తూ 2022 అక్టోబర్‌లో దళ సభ్యుడుగా పదోన్నతి పొందాడు. కొన్ని రోజుల పాటు భద్రాద్రి కొత్తగూడెం – అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ సభ్యుడు ఆజాద్‌కు గార్డుగానూ లక్ష్మయ్య పని చేశాడు. అనంతరం కొన్ని రోజులకు చర్ల ప్లాటూన్‌లో దళ సభ్యుడిగా పని చేసి.. గత ఏడాది శబరి ఏరియా కమిటీకి బదిలీ అయ్యాడని ఎస్పీ రోహిత్ వివరించారు.

ఇక లొంగిపోయిన మరో మావోయిస్టు మల్లం దేవాది చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా గొల్లపల్లి గ్రామానికి చెందినవాడు. 2007 నుంచి 2015 వరకు మావోయిస్టు పార్టీకి చెందిన బాలల సంఘంలో పని చేశాడు. తర్వాత గొల్లపల్లి ఎల్వోఎస్ కమాండర్ మడకం ఉంగల్ అలియాస్ ఎర్రాల్ వద్ద సభ్యుడుగా చేరి.. 2017లో మిలీషియా కమాండర్‌గా పదోన్నతి పొందాడు. 2020లో దళ సభ్యుడిగా పదోన్నతి పొంది ఇప్పటివరకు గొల్లపల్లి ‌దళ సభ్యుడిగా కొనసాగాడు. గొల్లపల్లి ఎల్వోఎస్ కమాండర్ ఎర్ర దాదా (డీవీసీ) చనిపోయాక తర్వాత అతడి స్థానంలో దేవా ఇన్‌ఛార్జిగా పని చేశారు.

కాగా వివిధ కారణాలతో అడవి బాట పట్టి మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న వారిని జనజీవన స్రవంతిలో కలిపేందుకు భద్రాద్రి పోలీసులు ఆపరేషన్ చేయూత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి కుటుంబాలకు అవగాహన కల్పిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి తదితర కారణాలతో మావోయిస్టు పార్టీ నుండి బయటకు వచ్చి లొంగిపోయిన వారు సాధారణ జీవనం కొనసాగించేందుకు పోలీసులు చేయూతను అందిస్తున్నారు.

More Telugu News