Antim Panghal: రెజ్లర్ అంతిమ్ పంఘల్‌పై మూడేళ్ల నిషేధం విధించినట్టు వార్తలు.. ఖండించిన ఐఓఏ!
- అంతిమ్ అక్రిడిటేషన్‌తో ఆమె సోదరి నిశా ఒలింపిక్ విలేజీలోకి ప్రవేశం
- ఆమెను పోలీసులు పట్టుకుని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన వైనం
- దాంతో అంతిమ్ పరివారంతో సహా పారిస్ నుండి బహిష్కరణ
ఒలింపిక్ క్రీడల సమయంలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు భారత రెజ్లర్ అంతిమ్ పంఘల్‌పై మూడేళ్ల పాటు ఆమెపై నిషేధం విధించినట్లు వార్తలు వెలువడ్డాయి. క్రమశిక్షణా కారణాలతో యువ రెజ్లర్‌పై నిషేధం విధించే అవకాశం ఉందని న్యూస్ ఏజెన్సీ పీటీఐ మొదట పేర్కొంది. అయితే, ఇండియన్ ఒలింపిక్ అసోషియేషన్ (ఐఓఏ) సోషల్ మీడియా ద్వారా ఈ వార్తలను ఖండించింది. అటువంటి నివేదికలను పోస్ట్ చేసే ముందు దయచేసి ఐఓఏ అధికారులను సంప్రదించాలని మీడియాను కోరింది.
అంతిమ్ విషయంలో అసలేం జరిగిందంటే..
అంతిమ్ అక్రిడిటేషన్‌తో ఆమె సోదరి నిశా ఒలింపిక్ విలేజీలోకి ప్రవేశించడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని కొద్దిసేపటి తర్వాత విడిచిపెట్టిన విషయం తెలిసిందే. దాంతో అంతిమ్ తన పరివారంతో సహా పారిస్ నుండి బహిష్కరణకు గురైనట్టు వార్తలు వచ్చాయి.
ఇక క్రమశిక్షణ ఉల్లంఘనను ఫ్రెంచ్ అధికారులు ఐఓఏ దృష్టికి తీసుకురావడంతో రెజ్లర్ అంతిమ్, ఆమె సహాయక సిబ్బందిని వెనక్కి రప్పించాలని భారత ఒలింపిక్ సంఘం నిర్ణయించినట్టు తెలిసింది.
కాగా, అంతిమ్ ఒలింపిక్ విలేజ్‌కి వెళ్లడానికి బదులు ఆమె తన కోచ్ భగత్ సింగ్, వ్యక్తిగత సహాయక సిబ్బంది వికాస్ ఉన్న హోటల్‌కి చేరుకుంది. ఆ సమయంలో తన సోదరిని గేమ్స్ విలేజ్‌కి వెళ్లి తన వస్తువులతో తిరిగి రావాలని తెలిపింది.
అంతిమ్ అక్రిడిటేషన్‌తో ఆమె సోదరి నిశా ఒలింపిక్ విలేజీలోకి ప్రవేశించడంతో పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేయడానికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆమె స్టేట్మెంట్ తీసుకుని విడిచిపెట్టారు.
ఇక మహిళల 53 కేజీల విభాగంలో బుధవారం జరిగిన ఓపెనింగ్ బౌట్లో పంఘల్ ఓడిపోయి ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.