Andhra Pradesh: గోదావరి ఒడ్డున కూలిన సినీ వృక్షానికి పునరుజ్జీవనం

Rotary club to take care of uprooted Cinema Cheetu

  • ముందుకు వచ్చిన రాజమహేంద్రవరం రోటరీ క్లబ్
  • బుధవారం కూలిన వృక్షాన్ని పరిశీలించిన కలెక్టర్, అధికారులు
  • వృక్షం పునరుజ్జీవానికి కెమికల్ ట్రీట్మెంట్ విధానంపై చర్చ

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవంలో గోదావరి నది ఒడ్డున కుప్పకూలిన నిద్రగన్నేరు చెట్టును చిగురింప చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కుమారదేవంలోని 150 ఏళ్ల నాటి భారీ వృక్షం నేలకొరిగింది. వందల సినిమాల్లో అద్భుత సన్నివేశాలకు వేదికగా నిలిచింది ఈ భారీ వృక్షం. ప్రముఖ దర్శకులు, హీరోల సినిమాలలోని ఎన్నో పాటలను ఈ చెట్టు వద్ద చిత్రీకరించారు. కృష్ణ నటించిన పాడిపంటలు సినిమాతో ఈ వృక్షానికి ప్రత్యేక గుర్తింపు వచ్చి... ఆ తర్వాత క్రమంగా సినీ వృక్షంగా పేరు పొందింది.

150 ఏళ్లుగా ఈ వృక్షం ఎన్నో ప్రకృతి విపత్తులను తట్టుకొని నిలబడింది. అయితే ప్రతి సంవత్సరం వచ్చే వరదలకు గోదావరి గట్టు కొద్దికొద్దిగా దిగబడుతుండటంతో చివరకు ఈ వృక్షం నేలకొరిగింది. ఈ చెట్టును తిరిగి చిగురింప చేసేందుకు రాజమహేంద్రవరం రోటరీ క్లబ్ ముందుకు వచ్చింది.

కూలిన సినీ వృక్షాన్ని పరిశీలించేందుకు జిల్లా అటవీ శాఖాధికారి నాగరాజు, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి కలెక్టర్ పి.ప్రశాంతి వచ్చారు. దీనిని బతికించే కెమికల్ ట్రీట్మెంట్ విధానంపై రోటరీ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ తీగల రాజుతో చర్చించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... 150 సంవత్సరాల చరిత్ర గల ఈ వృక్షం భారీ వర్షాలు, వరదల కారణంగా రెండుగా చీలిపోయిందన్నారు. రోటరీ క్లబ్ సహకారంతో ఆధునిక పద్ధతుల ద్వారా దీనిని బతికించే కృషి జరుగుతోందన్నారు. ఈ చెట్టుతో పరిసర ప్రాంతాలు, ఉభయ గోదావరి జిల్లా ప్రజలకు, సినీ పరిశ్రమకు ఎంతో అనుబంధం ఉందన్నారు. కెమికల్ ట్రీట్మెంట్ ద్వారా ఇప్పటి వరకు పది చెట్లకు ప్రాణం పోశామని, దీనిని కూడా పునరుజ్జీవింప చేస్తామని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఛార్టర్ అధ్యక్షుడు రాజా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News