KTR: బీఆర్ఎస్ పార్టీపై పుకార్లు సృష్టించేవాళ్లకు ఇదే ఫైనల్ వార్నింగ్: కేటీఆర్

KTR tweets this is final warning who spreading rumors on BRS Party

  • బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ ఓ చానల్ లో బిగ్ బ్రేకింగ్
  • ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్
  • తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిక

బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారంటూ గత రాత్రి ఓ వార్తా చానల్ లో బిగ్ బ్రేకింగ్  రావడం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నిరాధార వార్తలు, పుకార్లు సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 

పడతాం, లేస్తాం, తెలంగాణ కోసమే పోరాడతాం... కానీ తలవంచం... ఎప్పటికైనా, ఎన్నటికైనా జై తెలంగాణ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 

"24 సంవత్సరాలుగా అకుంఠిత దీక్షతో, అంకితభావంతో తెలంగాణ కోసం పాటుపడుతున్నాం. వందలాదిమంది వినాశకారులకు, వేలాదిమంది తప్పుడు ప్రచారకర్తలకు, కుట్రలకు 24 ఏళ్లుగా ఎదురొడ్డి నిలిచాం. ఇప్పటికీ మేం నిలబడే ఉన్నాం. అవిశ్రాంతంగా పోరాడి... ప్రగతికి, ప్రతిష్ఠకు వెలుగు దివ్వెలా నిలిచే రాష్ట్రాన్ని నిర్మించాం. మనకు కూడా ఇలాంటి రాష్ట్రం కావాలి అని అందరూ అనుకునే విధంగా తెలంగాణను తీర్చిదిద్దాం. ఏ ఉనికి కోసం, ఏ భావోద్వేగం కోసం అయితే లక్షలాది హృదయాలు కొట్టుకున్నాయో... అది తెలంగాణ. 

ఇప్పుడు చెబుతున్నాం... కుట్రపూరితమైన అజెండాలతో, నిరాధారమైన, పుకార్లు వ్యాపింపజేసేవారికి ఇదే ఆఖరి హెచ్చరిక. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మీరు సృష్టించిన తప్పుడు వార్తలకు సవరణగా ఒక ప్రకటన విడుదల చేయండి... లేదా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలకు సేవలందిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఇకపైనా అదే పంథా కొనసాగిస్తుంది. ఆధారాలు లేకుండా పుకార్లు ప్రచారం చేయడం ఇకనైనా ఆపండి" అంటూ కేటీఆర్ తన ట్వీట్ లో స్పష్టం చేశారు.

More Telugu News