Sadhguru Jaggi Vasudev: బంగ్లాకు మనం అండగా నిలవాలి.. అలా చేయలేదంటే మనది మహా భారత్ కానే కాదు: సద్గురు జగ్గీ వాసుదేవ్
- ఆ దేశంలోని మైనారిటీలను కాపాడుకోవాలని ఎక్స్ వేదికగా కోరిన సద్గురు
- ఒకప్పటి అఖండ భారత్ ఇప్పుడు రణరంగంగా మారడం బాధిస్తోందని వ్యాఖ్య
- బంగ్లాదేశ్‌ను రక్షించడం మన బాధ్యత అన్న ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త
హింసాత్మక నిరసనలతో అట్టుడుకుతున్న పొరుగు దేశం బంగ్లాదేశ్‌ను రక్షించడం మన బాధ్యత అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. ఆ దేశంలోని మైనారిటీలను కాపాడుకోవాలని ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా కోరారు.
"బంగ్లాదేశ్ అల్లర్లు ఆ దేశానికే పరిమితం కాదు. ఒకప్పటి అఖండ భారత్ ఇప్పుడు రణరంగంగా మారడం బాధిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాకు మనం అండగా నిలవాలి. మన పొరుగున ఉన్న మైనారిటీల భద్రత కోసం మనం వీలైనంత త్వరగా నిలబడకపోతే, భారత్ మహా భారత్ కానే కాదు. దురదృష్టవశాత్తూ ఈ దేశంలో భాగమైన ప్రాంతం పొరుగు ప్రాంతంగా మారింది. అయితే ఈ దిగ్భ్రాంతికరమైన దురాగతాల నుండి, వాస్తవానికి ఈ నాగరికతకు చెందిన వారిని రక్షించడం మన బాధ్యత" అని సద్గురు ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.