Salman Khurshid: భారత్‌లో కూడా బంగ్లా తరహా హింసాత్మక నిరసనలు జరగొచ్చు: కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్
- నిరసనకారుల ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్
- ఈ నేపథ్యంలో సల్మాన్ ఖుర్షీద్ తాజాగా సంచలన వ్యాఖ్యలు
- భారత్‌లో పైకి అంతా బాగానే కనిపిస్తున్నా బంగ్లా మాదిరి హింసాత్మక ఆందోళనలు జరగొచ్చని హెచ్చరిక
- షాహిన్ బాగ్‌లో జరిగిన నిరసనలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయని వ్యాఖ్య
పొరుగు దేశం బంగ్లాదేశ్ నిరసనకారుల ఆందోళనలతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ సర్వీసులలో రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా జులైలో మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో భారీ మొత్తంలో ప్రాణనష్టంతో పాటు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి, దేశం నుంచి పారిపోయేలా చేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో కూడా బంగ్లాదేశ్ తరహా హింసాత్మక నిరసనలు జరగొచ్చని అన్నారు.
మంగళవారం ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో పైకి అంతా బాగానే కనిపిస్తున్నా బంగ్లాదేశ్ మాదిరి హింసాత్మక, ప్రభుత్వ-వ్యతిరేక నిరసనలు జరిగే అస్కారం ఉందని హెచ్చరించారు. కశ్మీర్‌లోనూ, ఇక్కడా అంతా బాగానే ఉందనిపిస్తుందనీ, కానీ, క్షేత్రస్థాయిలో వేరే పరిస్థితులు దాగి ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
సీఏఏ-ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా ఆగ్నేయ ఢిల్లీలోని షాహిన్ బాగ్‌లో జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయని ఈ సందర్భంగా సల్మాన్ ఖుర్షీద్ గుర్తు చేశారు. మహిళలు నాయకత్వం వహించిన ఈ నిరసనలు దాదాపు 100 రోజుల పాటు కొనసాగాయన్నారు. ఈ నిరసనలు దేశవ్యాప్తంగా ప్రేరణగా నిలిచాయని చెప్పారు. అయితే, ఈ నిరసనల్లో పాల్గొన్న చాలా మంది ఇప్పటికీ జైల్లో ఉన్నందున ఆయన దీనిని విఫలమైన ఆందోళనగా పేర్కొన్నారు.