Chandrababu: చంద్రబాబుపై పోటీ చేసినందుకే తనపై ఈ దుష్ప్రచారం అంటున్న వైసీపీ ఎమ్మెల్సీ భరత్
- వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పై గుంటూరులో కేసు నమోదు
- రాజకీయ కక్షతో తనపై తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేశారంటున్న ఎమ్మెల్సీ భరత్
- పూర్తి వివరాలతో త్వరలో మీడియా ముందుకు వస్తానని భరత్ ప్రకటన
తిరుమల సిఫార్సు లేఖలను విక్రయించారన్న అభియోగంపై గుంటూరులో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పై కేసు నమోదు కావడం తీవ్ర సంచలనం అయింది. తనపై గుంటూరు అరండల్ పేటలో కేసు నమోదు కావడం, తనపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్సీ భరత్ స్పందించారు. తిరుమల శ్రీవారి దర్శనం, పూజ టికెట్లు విక్రయించుకునేంత దౌర్భాగ్యం తనకు పట్టలేదని ఆయన అన్నారు. తన తండ్రి ఓ ఐఏఎస్ అధికారి అని.. తాను బ్యూరోక్రాట్ కుటుంబం నుండి వచ్చానని చెప్పారు. ఉన్నతమైన విలువలతో తమ కుటుంబం బతుకుతోందని చెప్పారు. తనకు మల్లికార్జునరావు అనే పీఆర్ఓనే లేడని ఆయన పేర్కొన్నారు. మల్లికార్జునరావు అనే ఆ వ్యక్తితో తనకు పరిచయం కూడా లేదని అన్నారు.
కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుపై పోటీ చేయడంతో పాటు అక్కడ ఆయనను ఎదుర్కొంటూ రాజకీయాల్లో నిలబడ్డానన్న రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని భరత్ ఆరోపించారు. తనను తన కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సెల్ఫీ వీడియో విడుదల చేసిన భరత్ ..తనపై ఫిర్యాదు చేసింది ఎవరు.. పోలీసులు కేసులో పేర్కొన్న వ్యక్తులు ఎవరు అనే విషయాలు అన్నీ ఆరా తీస్తాననీ, పూర్తి వివరాలతో త్వరలో మళ్లీ మీడియా ముందుకు వస్తానని తెలిపారు.