Jangaon District: సీటు విషయంలో వివాదంతో కండక్టర్ సస్పెన్షన్... జనగామలో డిపోకే పరిమితమైన బస్సులు

Jangaon RTC workers dharna at Depot

  • కండక్టర్ శంకర్‌ను సస్పెండ్ చేసిన అధికారులు
  • విచారణ జరపకుండా సస్పెండ్ చేశారంటూ డిపో ఎదుట ఉద్యోగుల ధర్నా
  • సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోవాలని కార్మికుల డిమాండ్

తెలంగాణలోని జనగామ జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఓ కండక్టర్‌ను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ ఉద్యోగులు డిపో ఎదుట ఆందోళన నిర్వహించారు. సీటు విషయంలో జరిగిన వివాదం... చివరకు కండక్టర్‌పై ఓ మహిళా ప్యాసింజర్ ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది. దీంతో అతనిని సస్పెండ్ చేశారు. అయితే కండక్టర్‌పై ఎలాంటి విచారణ జరపకుండా... అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ ఉద్యోగులు ధర్నాకు దిగారు. సస్పెండ్ చేసిన కండక్టర్ శంకర్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆందోళనతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.

ఈ నెల 1న జనగామ నుంచి హన్మకొండకు వెళుతున్న బస్సులో ఓ గర్భిణీ ఎక్కింది. బస్సు కిక్కిరిసి ఉండటంతో కండక్టర్ శంకర్ గర్భిణీ కోసం ఓ సీటును ఆపాడు. ఈ విషయమై ప్రయాణికులతో వివాదం తలెత్తింది. ఈ గొడవ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులు... శంకర్‌ను సస్పెండ్ చేశారు.

అయితే ఏం జరిగిందో తెలియకుండా ఉద్యోగిపై చర్యలు తీసుకోవడం ఏమిటని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో డిపో ఎదుట బైఠాయించారు. ఎలాంటి విచారణ లేకుండా కండక్టర్‌ను సస్పెండ్ చేసినందుకు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News