Ashish Nehra: గంభీర్ అనుసరిస్తున్న విధానం తప్పని అనడంలేదు: ఆశిష్ నెహ్రా

Ashish Nehra comments on coach Gambhir strategy

  • లంకతో వన్డే సిరీస్ కు రోహిత్, కోహ్లీ అవసరంలేదన్న నెహ్రా
  • వాళ్లిద్దరి స్థానంలో కొత్త ఆటగాళ్లను తీసుకుని ఉంటే బాగుండేదని వెల్లడి
  • యువ ఆటగాళ్లను ప్రయత్నించడానికి ఇదే మంచి చాన్స్ అని వ్యాఖ్యలు

శ్రీలంకలో పర్యటిస్తున్న టీమిండియా టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసినా, వన్డే సిరీస్ లో మాత్రం ప్రతికూల ఫలితాలు చవిచూస్తోంది. గెలవాల్సిన తొలి వన్డేను టైగా ముగించిన టీమిండియా... రెండో వన్డేలో ఘోరంగా ఓడింది. 241 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిలపడింది. 

ఈ నేపథ్యంలో, టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ అనుసరిస్తున్న వ్యూహంపై మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా స్పందించాడు. గంభీర్ కొత్త కోచ్ అనే విషయం తనకు తెలుసని, అయితే, శ్రీలంకతో వన్డే సిరీస్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి పెద్ద ఆటగాళ్ల అవసరంలేదని నెహ్రా అభిప్రాయపడ్డాడు. వాళ్లిద్దరి స్థానంలో గంభీర్ ఎవరైనా కొత్త కుర్రాళ్లను తీసుకుని ఉంటే బాగుండేదని అన్నాడు. 

కొత్త ఆటగాళ్లను ప్రయత్నించి చూడడానికి గంభీర్ కు ఇది మంచి అవకాశమని, అయితే గంభీర్ ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని తాను తప్పని అనడంలేదని నెహ్రా స్పష్టం చేశాడు. గంభీర్ విదేశీ కోచ్ కాదని, అతడికి రోహిత్ శర్మ, కోహ్లీల ఆటతీరు గురించి పూర్తి అవగాహన ఉంటుందని తెలిపాడు. 

"విదేశీ కోచ్ అయితే.. రోహిత్, కోహ్లీల ఆటతీరు పరిశీలించడానికి వారిద్దరినీ జట్టులోకి తీసుకున్నాడని అనుకోవచ్చు. కానీ వాళ్లిద్దరి గురించి గంభీర్ కు తెలియనిది ఏముంది? యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడానికి ఇదే మంచి తరుణం అని చెప్పడమే నా ఉద్దేశం" అని నెహ్రా వివరించాడు. 

అంతర్జాతీయ టీ20 కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ... కోచ్ గంభీర్ పిలుపు మేరకే శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో, నెహ్రా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

More Telugu News