Bangladesh protests: బంగ్లాదేశ్‌లో భయంకర పరిస్థితులు... జాతిపిత విగ్రహాన్ని కూడా వదలని నిరసనకారులు!
- బంగ్లా రాజధాని ఢాకాలో ఆందోళనకారుల విధ్వంసం
- ఢాకాలోని ప్రధాని ప్యాలెస్ ముట్టడి
- జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహం ధ్వంసం
- సుమారు 4 లక్షల మంది నిరసనకారులు వీధుల్లో ఉన్నట్లు స్థానిక మీడియా అంచనా
బంగ్లాదేశ్‌లో పరిస్థితులు అంతకంతకు దిగజారుతున్నాయి. బంగ్లా రాజధాని ఢాకాలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచివెళ్లినట్లు వార్తలు రావడంతో వేలాది మంది బంగ్లాదేశ్ నిరసనకారులు కర్ఫ్యూను ధిక్కరించి రాజధాని ఢాకాలోని ప్రధాని ప్యాలెస్‌ను ముట్టడించారు.
అంతటితో ఆగకుండా ఆ దేశ జాతిపిత, హసీనా తండ్రి, బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూడా వారు ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఢాకాలో ఎక్కడిక్కడ సైనికులు, పోలీసులు సాయుధ వాహనాలు, ముళ్ల కంచెలు, బారికేడ్లు ఉన్నప్పటికీ... ఆందోళనకారులు అన్నింటినీ దాటుకుని వచ్చి హసీనా కార్యాలయాన్ని ముట్టడించినట్లు అక్కడి మీడియా పేర్కొంది.
సుమారు 4 లక్షల మంది నిరసనకారులు వీధుల్లో ఉన్నారని స్థానిక మీడియా అంచనా. సివిల్ సర్వీస్ ఉద్యోగాల కోటాలకు వ్యతిరేకంగా గత నెలలో ప్రారంభమైన నిరసన ర్యాలీలు ప్రధాని హసీనా 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికే వరకు వెళ్లింది. అంతేగాక దేశంలో తీవ్ర అశాంతికి దారితీశాయి.
నిరసనకారుల ఆందోళన నేపథ్యంలో నిన్న జరిగిన హింసలో 14 మంది పోలీసు అధికారులతో సహా 98 మంది మృతిచెందారు. జులైలో నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి హింసాకాండలో ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 300కి చేరింది.