Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్ సెమీఫైనల్ ప్రత్యర్థి ఖరారు
![India Hockey Team opponent in the semifinal will be Germany at the Paris Olympics](https://imgd.ap7am.com/thumbnail/cr-20240805tn66b02cbf3e8a4.jpg)
వరుసగా రెండవసారి పారిస్ ఒలింపిక్స్‌లో పతకాన్ని ముద్దాడేందుకు భారత హాకీ జట్టు కేవలం ఒక్క అడుగు దూరంలోనే నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్లో హర్మన్‌ప్రీత్ సింగ్ సారధ్యంలోని భారత జట్టు బ్రిటన్‌ను మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సెమీఫైనల్ ప్రత్యర్థి ఖరారైంది. హాకీ సెమీఫైనల్‌లో పటిష్ఠమైన జర్మనీ జట్టుని భారత్ ఢీకొట్టడం ఖరారైంది. సోమవారం తెల్లవారుజామున జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనాను జర్మనీ 3-2తో ఓడించింది. దీంతో ఆగస్టు 6న (మంగళవారం) రాత్రి 10:30 గంటలకు సెమీఫైనల్‌లో జర్మనీతో భారత్ తలపడనుంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కోసం ఈ రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆశ్చర్యకరంగా మళ్లీ ఇప్పుడు ఒలింపిక్స్‌లో కీలకమైన మ్యాచ్ ఆడబోతున్నాయి.
మరో సెమీఫైనల్‌లో స్పెయిన్-నెదర్లాండ్స్ తలపడనున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతక విజేత అయిన ఆస్ట్రేలియాపై 2-0 తేడాతో విజయం సాధించి నెదర్లాండ్స్ సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇక స్పెయిన్ జట్టు 3-2తో బెల్జియంను మట్టికరిపించింది.
వరుసగా రెండో పతకం గెలిచే ఛాన్స్
2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పోరులో భారత్ 5-4తో జర్మనీపై చారిత్రాత్మకమైన విజయం సాధించింది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత తిరిగి పతకం గెలవడం అదే తొలిసారి. ఇక ఈసారి హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని జట్టు సెమీస్‌లో జర్మనీని ఓడిస్తే ఫైనల్‌కు చేరే అవకాశం లభిస్తుంది. ఫైనల్లో స్వర్ణం గెలిస్తే సరికొత్త చరిత్ర లిఖించడం ఖాయమవుతుంది.
కాగా ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బ్రిటన్‌పై భారత్ సంచలన విజయం సాధించింది. ఆట పూర్తయ్యే సమయానికి ఇరు జట్లు 1-1 గోల్స్ సాధించడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. షూటౌట్‌లో భారత్ 4-2తో చారిత్రాత్మక విజయం సాధించింది.