Chandrababu: గురు ప్రసన్న బాధ్యతను తీసుకోవడం సీఎం చంద్రబాబు గొప్ప మనస్సుకు నిదర్శనం: మంత్రి నారా లోకేశ్
- నంద్యాల జిల్లాలో విషాద ఘటన
- మట్టి మిద్దె కూలి నలుగురి దుర్మరణం
- అనాథగా మారిన గురు ప్రసన్న అనే బాలిక
- రూ.10 లక్షల సాయం ప్రకటించిన చంద్రబాబు
- బాలిక సంరక్షణ బాధ్యతను తీసుకున్న వైనం
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలి గ్రామంలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం తెలిసిందే. ఈ ఘటనలో తల్లిదండ్రులను, తోబుట్టువులను కోల్పోయిన గురు ప్రసన్న (15) అనే బాలిక అనాథగా మారింది.
అయితే, తానున్నానంటూ సీఎం చంద్రబాబు ఆ బాలికకు ఆపన్న హస్తం అందించారు. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. మట్టి మిద్దె కూలిన ఘటనలో అయినవాళ్లు సజీవ సమాధి కాగా, అనాథగా మారిన బాలిక గురు ప్రసన్న సంరక్షణను స్వీకరించడం ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్ప మనసుకు నిదర్శనం అని కొనియాడారు.
విధి ఆ బాలికను అనాథను చేస్తే, చంద్రబాబు అక్కున చేర్చుకున్నారని వివరించారు. సీఎం చంద్రబాబు ఆ బాలిక పేరు మీద రూ.10 లక్షలు డిపాజిట్ చేసి, ఆ బాలిక నాయనమ్మ నాగమ్మకు రూ.2 లక్షలు సాయం ప్రకటించారని, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని నారా లోకేశ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.