Wayanad Landslides: వాయనాడ్ బాధితులకు రూ.1 కోటి విరాళం ప్రకటించిన చిరంజీవి, రామ్ చరణ్
- వాయనాడ్ లో ప్రకృతి బీభత్సం
- కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా మృతి
- 200 మంది ఆచూకీ తెలియని వైనం
- చలించినపోయిన చిరంజీవి, రామ్ చరణ్
- రూ.1 కోటి విరాళం ప్రకటన
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తమ మంచి మనసును మరోసారి చాటుకున్నారు. వాయనాడ్ బాధితులకు రూ.1 కోటి విరాళం ప్రకటించారు. కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే కేరళ ప్రభుత్వానికి తమ మద్ధతుని తెలియజేసిన సంగతి తెలిసిందే.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి వాయనాడ్ బాధితుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. "వాయనాడ్ జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో నా గుండె తరుక్కుపోతుంది. బాధితులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నా" అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా సానుభూతిని ప్రకటించారు.
కార్గిల్ వార్ సందర్భంలో కానీ, గుజరాత్ భూకంపం సంభవించినప్పుడు, సునామీ వచ్చి ప్రజలు ఇక్కట్లు పడుతున్నప్పుడు, ఉత్తరాఖండ్ వరదలు, కోనసీమ వరదల సమయంలో కానీ, వైజాగ్‌లో హుదూద్ వచ్చినప్పుడు, కోవిడ్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు.. ఇలా ఒకటేమిటి... ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడిన ప్రతి సందర్భంలోనూ చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు బాధితులకు అండగా నిలిచారు. తాజాగా వాయనాడ్ బాధితులకు కూడా భారీ విరాళం ప్రకటించి, సహాయక చర్యలకు తమవంతు తోడ్పాటు అందించారు.