Amit Shah: 2029లోనూ మేమే వస్తాం... మీరు అక్కడే ఉంటారు: విపక్షాలకు అమిత్ షా కౌంటర్

Amit Shah counters opposition parties

  • ఎన్డీయే సంఖ్యాబలంపై విపక్షాల విమర్శలు
  • ఎన్డీయే కూటమి ఐదేళ్లు పూర్తి చేసుకుంటుందని అమిత్ షా స్పష్టీకరణ
  • మళ్లీ విపక్షంలో కూర్చునేందుకు సిద్ధంగా ఉండండి అంటూ వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమి గెలుస్తుందని, ఇండియా కూటమి విపక్షంలోనే కూర్చుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చండీగఢ్ లో మణిమజ్ర 24×7 నీటి సరఫరా ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో అమిత్ షా ప్రసంగిస్తూ... 2029లోనూ మేమే అధికారంలోకి వస్తాం... మీరు మళ్లీ విపక్షంలోనే ఉండడానికి సిద్ధంగా ఉండండి అని వ్యాఖ్యానించారు. 

గత ఎన్నికలతో పోల్చితే ఇటీవలి ఎన్నికల్లో ఎన్డీయే బలం తగ్గడంపై విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలకు అమిత్ షా పైవిధంగా బదులిచ్చారు. "కొన్ని సీట్లు వచ్చినందుకే గెలిచినట్టు భావించుకుంటున్నారు. గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో... అంతకంటే ఎక్కువ సీట్లను బీజేపీ ఇటీవల ఎన్నికల్లో గెలుచుకుందన్న విషయం గుర్తించాలి. ప్రతిపక్ష కూటమి సాధించిన సీట్ల కంటే, ఎన్డీయే కూటమిలోని ఒక పార్టీ (బీజేపీ) సాధించిన సీట్లే ఎక్కువ అని వారికి తెలియడంలేదు. 

ప్రతిపక్షాలకు చెందిన మిత్రులకు ఓ విషయం చెబుతున్నాను... ఎన్డీయే సర్కారు ఐదేళ్లు పూర్తి చేసుకోవడమే కాదు... మళ్లీ అధికారంలోకి వస్తుంది. అందుకే విపక్షంలో ఉంటూ సమర్థంగా ఎలా పనిచేయాలో నేర్చుకోండి" అంటూ అమిత్ షా హితవు పలికారు. 

అంతేకాదు, ప్రతిపక్షాలు ఏదో మాట్లాడుతుంటాయి, అనిశ్చితి సృష్టించాలన్నదే ఆ పార్టీల ప్రయత్నం... మీరు ఆందోళన చెందవద్దు అంటూ బీజేపీ శ్రేణులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News