Gautam Gambhir: గంభీర్ కోచ్ పదవిలో ఎక్కువకాలం ఉండడు: జోగిందర్ శర్మ

Team India former pacer Joginder Sharma says Gambhir can not complete his tenure as coach

  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ పేసర్ జోగిందర్ శర్మ
  • గంభీర్ ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తి అంటూ వ్యాఖ్యలు
  • గంభీర్ నిర్ణయాలు జట్టులోని ఆటగాళ్లకు నచ్చకపోవచ్చని వెల్లడి
  • కోహ్లీని దృష్టిలో ఉంచుకుని ఈ వ్యాఖ్యలు చేయడంలేదని స్పష్టీకరణ

టీమిండియా ప్రధాన కోచ్ గా గౌతమ్ గంభీర్ ఇటీవలే బాధ్యతలు చేపట్టాడు. గంభీర్ కోచ్ గా టీమిండియా శ్రీలంకపై టీ20 సిరీస్ నెగ్గింది. ప్రస్తుతం వన్డే సిరీస్ ఆడుతోంది. అయితే, టీమిండియా మాజీ పేసర్ జోగిందర్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

గంభీర్ ఎక్కువకాలం టీమిండియా కోచ్ గా కొనసాగలేడని, పదవీకాలం పూర్తి కాకముందే తప్పుకునే అవకాశాలున్నాయని తెలిపాడు. గంభీర్ ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తి అని, జట్టులోని ఆటగాళ్లకు గంభీర్ నిర్ణయాలు నచ్చకపోవచ్చని అన్నాడు. ఈ విషయాన్ని తాను కోహ్లీని దృష్టిలో ఉంచుకుని చెప్పడంలేదని, ఇతర ఆటగాళ్లు కూడా గంభీర్ తో విభేదించే అవకాశం ఉందని జోగిందర్ శర్మ పేర్కొన్నాడు. 

"నాకు తెలిసినంత వరకు గంభీర్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి. ఏదైనా మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. పొగడ్తలతో ఆకట్టుకోవాలని చూసే రకం కాదు. గంభీర్ నిబద్ధత, నిజాయతీ కలిగిన వ్యక్తి. అందుకే కోచ్ గా ఎక్కువకాలం కొనసాడలేడని చెబుతున్నాను. అయితే, నేను ఈ మాటలు ఈర్ష్యతో చెప్పడంలేదు. ముక్కుసూటితనం గంభీర్ కు కలిసిరాకపోవచ్చని అనుకుంటున్నాను" అంటూ జోగిందర్ శర్మ వివరించాడు. 

2007లో ధోనీ నాయకత్వంలో టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన వేళ... ఫైనల్లో పాకిస్థాన్ పై ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది జోగిందర్ శర్మే. భారీ షాట్లు కొడుతున్న మిస్బాను ఓ స్లో డెలివరీతో జోగిందర్ శర్మ బుట్టలో వేశాడు. దాంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ కు తెరపడింది, టీమిండియా ప్రపంచ విజేతగా నిలిచింది. జోగిందర్ శర్మ ప్రస్తుతం హర్యానా పోలీస్ డిపార్ట్ మెంట్ లో డీఎస్పీగా కొనసాగుతున్నాడు.

  • Loading...

More Telugu News