Komatireddy Venkat Reddy: నల్గొండ బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయండి: మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు
- అమెరికాకు వెళ్లి తిరిగి వచ్చే లోగా కూల్చేయాలని అధికారులకు ఆదేశం
- అనుమతులు లేకుండా నిర్మించారన్న మంత్రి
- వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనన్న మంత్రి కోమటిరెడ్డి
అమెరికాకు వెళ్తున్నాను... ఆగస్ట్ 11న తిరిగి వస్తాను... ఈలోగా అనుమతిలేని నల్గొండ బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం నల్గొండ కౌన్సిల్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్థానిక బీఆర్ఎస్ ఆఫీస్‌ను కూల్చివేయాలన్నారు.
మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్‌ను పిలిచి బీఆర్‌ఎస్ ఆఫీసు కూల్చివేత ఎంతవరకు వచ్చిందని ఆరా తీశారు. అమెరికా వెళ్లి తిరిగి 11న వస్తానని... ఆ లోపు ఈ తంతు పూర్తి చేయాలన్నారు. అనుమతులు లేకుండా పార్టీ ఆఫీస్ నిర్మాణం చేపట్టారని, కాబట్టి తొలగించాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు.
ఎన్నికల్లో పోటీపై కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్య
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని... ఆరోగ్యం సహకరించకపోవచ్చునని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో ఉన్నా, లేకున్నా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానన్నారు. నల్గొండ జిల్లా గుండ్లపల్లిలో డీ-37 కెనాల్‌కు శనివారం నీటిని విడుదల చేశారు. అనంతరం గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ వ్యవసాయ క్షేత్రంలో విరామం తీసుకుని భోజనం చేశారు. ఆ తర్వాత ముఖ్య అనుచరులు, సన్నిహితులతో ముచ్చటించారు. శ్రీశైలం సొరంగం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి చేయడం తన చిరకాల ఆకాంక్ష అన్నారు.