Chandrababu: కుటుంబాన్ని కోల్పోయిన బాలికకు రూ.10లక్షల సాయం ప్రకటించిన చంద్రబాబు
- చాగలమర్రిలో మిద్దె కూలిన ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు
- తల్లిదండ్రులు, తోబుట్టువుల మృతితో అనాదయిన బాలిక ప్రసన్న
- పార్టీ పరంగానూ బాసటగా నిలుస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలోని నలుగురు మృతి చెందిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. తల్లిదండ్రులు, తోబుట్టువులు కోల్పోయి అనాధగా మిగిలిన బాలిక తల్లపురెడ్డి గురు ప్రసన్న (15)కు చంద్రబాబు పది లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. అలానే బాలిక సంరక్షణ చూస్తున్న నానమ్మ తల్లపురెడ్డి నాగమ్మ (70)కు కూడా రూ.2 లక్షల సాయం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. మరో వైపు పార్టీ పరంగా కూడా ప్రసన్నకు బాసటగా నిలుస్తామని సీఎం పేర్కొన్నారు. ప్రసన్నకు మంజూరు చేసిన ఆర్ధిక సాయం రూ.10 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో మట్టి మిద్దె కూలింది. ఈ ఘటనలో తల్లపురెడ్డి గుణశేఖర్ తో పాటు ఆయన భార్య దస్తగిరి, కుమార్తెలు పవిత్ర, గురులక్ష్మి మృతి చెందారు. అయితే గురుశేఖర్ రెండో కుమార్తె ప్రసన్న ప్రొద్దుటూరులో నానమ్మ నాగమ్మ వద్ద ఉంటూ విద్యను అభ్యసిస్తోంది. దీంతో గుణశేఖర్ కుటుంబంలో ప్రసన్న ప్రమాదం నుండి బయటపడింది. ప్రమాదంలో కుటుంబం మొత్తాన్ని కోల్పోవడంతో బాలిక ప్రసన్న అనాధ అయిపోయింది. ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించి ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు.