Amaravati: అమరావతిలో అక్రమ లేఅవుట్లపై సీఆర్డీయే ఉక్కుపాదం.. రోడ్లు ధ్వంసం చేసి, హద్దురాళ్ల తొలగింపు

Big shock for the real estate traders in amaravathi

  • రాజధాని పరిసర ప్రాంతాల్లో భారీగా అక్రమ లేఅవుట్లు
  • సీఆర్డీయే అనుమతి లేకుండానే ప్లాట్లు
  • కొనుగోలుదారులకు అధికారుల హెచ్చరిక
  • అక్రమ లే అవుట్లపై అప్రమత్తంగా ఉండాలని సూచన

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పనులు మళ్లీ ఊపందుకున్నాయి. దీనిని సొమ్ము చేసుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ లే అవుట్లతో చెలరేగిపోతున్నారు. సీఆర్డీఏ నుంచి అనుమతులు లేకుండానే వ్యవసాయ భూముల్లో వెంచర్లు వేసి విక్రయాలు సాగిస్తున్నారు. వ్యవసాయ భూములను ప్లాట్లగా విభజించి విక్రయించాలంటే నిబంధనల ప్రకారం రెవెన్యూ శాఖకు నాలా పన్ను చెల్లించడంతోపాటు లాండ్ కన్వర్షన్ చేయించుకోవడం, ఆ తర్వాత ఆ భూమిలో పది శాతం స్థలాన్ని కామన్ సైట్‌గా ప్రభుత్వానికి అప్పగించడం వంటివి చేయాలి.
 
అలాగే, వివిధ శాఖల నుంచి అనుమతులు స్వీకరించాల్సి ఉంటుంది. అయితే ఇవేమీ పాటించకుండా తాడికొండ గ్రామ పరిసరాల్లో చాలా మంది తమ వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్లాట్లగా  మార్చి లే అవుట్లు వేశారు. అక్రమంగా ఏర్పాటు చేసిన ఈ వెంచర్లపై సీఆర్డీఏ దృష్టి సారించింది. ప్రొక్లైయిన్‌తో లేఅవుట్ల కంచెలను తొలగించడంతో పాటు హద్దురాళ్లను తొలగించారు. వెంచర్లలో వేసిన రోడ్లను ధ్వంసం చేశారు.
 
ఈ సందర్భంగా  కొనుగోలుదారులకు సీఆర్డీఏ అధికారులు హెచ్చరికలు చేశారు. ఇలాంటి అక్రమ లేవుట్లలో ఎవరైనా ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని అధికారులు హెచ్చరించారు. అనుమతులు లేకుండా వేసిన వెంచర్ల విషయంలో కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.

Amaravati
real estate traders
Andhra Pradesh
Big shock
  • Loading...

More Telugu News