Kinjarapu Acchamnaidu: కౌలు రైతులకు గుడ్ న్యూస్ .. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన

Good news for tenant farmers Agriculture Minister Achchennaidu key announcement

  • గత ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతు చట్టం రద్దు.. త్వరలో కొత్త చట్టం
  • కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి రుణాలు
  • ఆప్కాబ్ వాట్సప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభం

సహకార వ్యవస్థను గాడిలో పెట్టి సహకార సంఘాల ద్వారా రైతులకు అన్ని విధాలా సేవలందిస్తామని.. అందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం విజయవాడలో ఆప్కాబ్ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వానికైనా, ప్రజలకైనా వ్యవసాయం మరియు సహకార సంఘాలు అత్యంత ప్రాధాన్యమైనవి అన్నారు.
 
2019లో తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేసి 2016లో చేసిన చట్టాన్ని అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. భూ యజమాని అంగీకారం ఉంటేనే కార్డు ఇవ్వాలని మెలిక పెట్టడంతో, గతంలో వచ్చిన ప్రయోజనాలు కూడా అందక రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రతి కౌలు రైతుకు బ్యాంక్‌ రుణాలు, ప్రభుత్వ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సహకార వ్యవస్థలో ఈ-కేవైసీ అమలు చేసి పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి రుణాలు అందించాలని, చిట్టచివరి కౌలు రైతుకు కూడా న్యాయం జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కమర్షియల్ బ్యాంకులకు ధీటుగా సహకార సంఘాలను తీర్చిదిద్దాలని, నూతన సంస్కరణలతో రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.

90 శాతానికి పైగా వ్యవసాయం చేసేది కౌలు రైతులే


సొంత రైతులే వ్యవసాయాన్ని వదిలేస్తున్న నేపథ్యంలో, సాగు బాధ్యతను కౌలు రైతులే తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 90 శాతానికిపైగా కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారని అన్నారు. సీసీఆర్‌సీ పేరిట అనాలోచిత చట్టాన్ని తెచ్చి అన్నదాతలను గత ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. సీసీఆర్‌సీ కార్డులు రాక, ప్రభుత్వ ప్రయోజనాలు అందక, రైతులు కష్టాల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, కూటమి ప్రభుత్వం రాకతో రైతాంగానికి మళ్లీ మంచి రోజులు రావాలని, వ్యవసాయానికి ఊతమిచ్చేలా సహకార వ్యవస్థ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. 

పెత్తందారులకు కాకుండా పేదరికంలో ఉన్న నిజమైన రైతులకు రుణాలు ఇవ్వాలని, డిజిటలైజేషన్ తో అక్రమాలకు తావులేకుండా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని మంత్రి తెలిపారు. సహకార సంఘాల్లో అవినీతి జరిగిందని వస్తున్న వార్తలపై విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు, ప్రతి రైతు భూమిని వెబ్‌ ల్యాండ్‌లో పెట్టి గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆప్కాబ్ - డీసీసీబీ, సహకార సంఘాల ద్వారా మహిళా సంఘాలకు అధిక శాతం రుణాలను అందించాలన్నారు.

  • Loading...

More Telugu News